Russia: రష్యాలో 70వేల ఉద్యోగాలు.. భారతీయులకు బంపర్ ఆఫర్..
భారతీయులకు శుభవార్త.. రష్యా (Russia) లో కీలక రంగాల్లో 70 వేల మంది భారతీయ కార్మికులను నియమించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంజినీరింగ్, నిర్మాణం, జౌళి వంటి కీలక రంగాలలో నిపుణుల కొరతతో సతమతమవుతున్న రష్యా .. ఈదిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా.. సుమారు 70,000 మంది భారతీయ కార్మికులను నియమించుకునేందుకు ఉద్దేశించిన కీలక కార్మికుల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఒప్పందంలో భారతీయ కార్మికుల న్యాయమైన నియామకాలు, మోసాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్లో భారతదేశ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన కార్మికుల మార్పిడి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఒప్పందం ద్వారా నిర్మాణ రంగం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలలో నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. అలాగే భారతదేశంలోని వేలాది మందికి రష్యాలో ఉపాధి దొరుకుతుంది.
పుతిన్ భారత్ వచ్చి ఈ ఒప్పందం కుదుర్చుకుంటే.. ఈ సంవత్సరాంతానికల్లా సుమారు 70,000 మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రష్యా కార్మిక శాఖ నిర్దేశించిన కోటాల ప్రకారం ఆయా పరిశ్రమల్లో భారతీయ కార్మికులను వినియోగించుకునేందుకు ఈ ద్వైపాక్షిక ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. గతంలో భారతీయ సిబ్బందిని రష్యాలో అధిక జీతాల ఆశ చూపి మోసగించిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. కొత్త ఒప్పందంలో అలాంటి మోసాలను నివారించడానికి కఠినమైన జాగ్రత్తలు తీసుకోనున్నారు. నియామక ప్రక్రియ న్యాయంగా , సక్రమంగా జరిగేలా చూడటమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం.
పుతిన్ పర్యటన సందర్భంగా ఈ కార్మిక ఒప్పందాన్ని ప్రకటించడం ద్వారా భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆర్థిక, సామాజిక అంశాలకు కూడా విస్తరించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. రష్యాలో వేతనాలు, పని పరిస్థితులు మెరుగ్గా ఉండటం, అలాగే చారిత్రక మైత్రి కారణంగా భారతీయులు రష్యాలో పనిచేయడానికి మొగ్గు చూపడం ఈ ఒప్పందానికి బలాన్ని చేకూరుస్తోంది.ఈ ఒప్పందం ద్వారా భారతీయ యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విదేశీ మారకద్రవ్యం కూడా దేశానికి సమకూరనుంది. దౌత్యపరమైన ఈ కీలక అడుగు.. రెండు మిత్ర దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.







