Kolikapudi: కొలికపూడిపై చర్యలకు చంద్రబాబు భయపడుతున్నారా?
తిరువూరు (Tiruvuru) పాలిటిక్స్ టీడీపీకి (TDP) పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు (Kolikapudi Srinivasa Rao), ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) తారాస్థాయికి చేరిన విభేదాలు, పరస్పర బహిరంగ ఆరోపణలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణా సంఘం నివేదిక సమర్పించింది. అయినా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వేటు ఖాయం అనుకున్న తరుణంలో చంద్రబాబు (Chandrababu) మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. కొలికపూడిపై చర్య తీసుకుంటే తలెత్తే పరిణామాలపై చంద్రబాబు ఆందోళన చెందుతున్నారా? అనే కోణంలో ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య నెలకొన్న అంతర్గత పోరు చివరకు బహిరంగ విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా, కొలికపూడి… కేశినేని శివనాథ్‌కు డబ్బులు ఇచ్చానంటూ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో, పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని ఇరువురు నేతలను అధిష్టానం ఆదేశించింది. డీసీసీ ముందు హాజరైన కొలికపూడి తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని క్రమశిక్షణా సంఘం తేల్చింది. ఈ మొత్తం వివాదానికి కొలికపూడి శ్రీనివాస రావుదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్‌కు నివేదిక సమర్పించింది. డీసీసీ నివేదిక ప్రకారం, నిబంధనలు అనుసరించి, తక్షణమే కొలికపూడిపై సస్పెన్షన్ లేదా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
క్రమశిక్షణా సంఘం నివేదిక కొలికపూడి తప్పును ఎత్తి చూపినప్పటికీ, చంద్రబాబు మాత్రం వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరు. తాను స్వయంగా ఇద్దరితోనూ మాట్లాడతానని చెప్పడం గమనార్హం. కొలికపూడి శ్రీనివాస రావు దళిత వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు. కేశినేని శివనాథ్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో, క్రమశిక్షణా సంఘం నివేదిక మేరకు కొలికపూడిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటే, అది పార్టీకి రాజకీయంగా, సామాజికంగా భారీ నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. వైసీపీ ఈ అంశాన్ని బలంగా వాడుకునే అవకాశం ఉంది. కమ్మ నేతను కాపాడటానికి, దళిత నేతను బలిపశువును చేశారు అనే ప్రచారాన్ని వైసీపీ ఇప్పటికే మొదలుపెట్టింది. ఇవి దళిత సామాజిక వర్గంలో పార్టీపై వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఇంకా మూడున్నరేళ్లపాటు అధికారంలో కొనసాగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేపై, అదీ డీసీసీ నివేదిక సమర్పించిన వెంటనే, సస్పెన్షన్ వంటి తీవ్ర చర్యలు తీసుకోవడం సరికాదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం అనేది భవిష్యత్తులో ఇతర నేతల్లో అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలను కలుపుకుని పోవాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు సమాచారం.







