Sricity: శ్రీసిటీని సందర్శించిన జర్మనీ వాణిజ్య ప్రతినిధుల బృందం
జర్మనీలోని సాక్సోనీ రాష్ట్రానికి చెందిన 18 మంది వాణిజ్య ప్రతినిధుల బృందం శ్రీసిటీ (Sricity) ని సందర్శించింది. ఆ రాష్ట్ర వాణిజ్య, కార్మిక, ఇంధన, వాతావరణ శాఖ మంత్రి డిర్క్ పాంటర్ నేతృత్వంలో పర్యటనకు విచ్చేసిన ప్రతినిధులకు శ్రీసిటీ చైర్మన్ శ్రీని రాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీసిటీ ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌళిక సదుపాయాలు, విభిన్న రంగాల పరిశ్రమల ఎకోసిస్టం, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒనగూరే వ్యూహాత్మక వ్యాపార ప్రయోజనాలను డాక్టర్ సన్నారెడ్డి వివరించారు. 31 దేశాలకు చెందిన 240కి పైగా ప్రముఖ కంపెనీలకు నిలయమైన శ్రీసిటీలో జర్మనీకి చెందిన బెల్ ఫ్లేవర్స్ & ఫ్రాగ్రెన్సెస్, క్నాఫ్, కాంక్యో బర్ట్ పరిశ్రమలు సైతం ఉన్నాయని వారి దృష్టికి తెచ్చారు.
అలాగే భారత ప్రభుత్వం అందిస్తున్న పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
శ్రీసిటీలో పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అనుకూలతలపై ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా శ్రీసిటీ ప్రణాళిక, మౌళిక సదుపాయాలు, పెట్టుబడి అనుకూల విధానాలను ప్రశంసించిన పాంటర్, భవిష్యత్తులో మరిన్ని జర్మన్ సంస్థలు ఇక్కడ కంపెనీలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం ప్రతినిధి బృందం స్థానిక బెల్ ఫ్లేవర్స్ & ఫ్రాగ్రెన్సెస్ పరిశ్రమను సందర్శించి, కార్యకలాపాలను పరిశీలించింది.
ఈ సందర్శన ప్రపంచ పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా శ్రీసిటీ స్థానాన్ని బలపరచడంతో పాటు భారత్, జర్మనీ దేశాల మధ్య వ్యాపార సంబంధాలకు పెంపొందిస్తాయి. సాక్సోనీ రాష్ట్ర వాణిజ్య అభివృద్ధి సంస్థ “విర్ట్స్ ఛాఫ్ట్” ఆధ్వర్యంలో సాగిన ఈ పర్యటనలో ప్రధానంగా దుస్తులు, మెటల్ ఉత్పత్తులు, వైద్య పరికరాల తయారీ, నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ కార్యక్రమాలలో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించారు.







