Visakhaptnam: విశాఖ సాగర తీరాన జనసేన పండుగ..
2024 జనసేన చరిత్రలో కీలక మలుపు. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీతో జతకట్టి అత్యధికంగా 21 సీట్లను సాధించింది జనసేన. ఇక సేనాని అయితే ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. దీంతో పాటు అటవీశాఖ, ఇతరశాఖలను చూస్తున్నారు. ఇటీవలి కాలం వరకూ పాలనపై ఫోకస్ పెట్టిన జనసేనాని పవన్.. ఇప్పుడు పార్టీ పటిష్టతపైనా దృష్టి సారించారు. ఈ ప్రణాళికలో భాగంగా విశాఖలో మూడురోజుల పాటు సేనతో సేనాని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఇవాళ, రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది. బీచ్ రోడ్డులోని YMCA ప్రాంగణంలో జనసేన లెజిస్ట్లేటివ్ విభాగం భేటీ అవుతుంది. ఆపార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొంటారు. మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గంతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారు.25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున ప్రతినిధులతో పార్టీ అధినేత ప్రత్యేకంగా ముఖాముఖీ నిర్వహిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఈనెల 30న జరిగే ‘ సేనతో సేనాని ‘ బహిరంగ సభపై జనసేనతో సహా రాజకీయపక్షాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి 15వేల మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఈ మీటింగ్ జరగనుండగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వర్షాలు కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ హ్యాంగర్స్ నిర్మించారు
ఇక, ఈ సభా ప్రాంగణానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేసింది జనసేన. ఐదు గేట్ల ద్వారా సభికులు, నాయకత్వం వచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఆవిర్భావం నుంచి నిస్వార్ధంగా జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి, అధినేత భావజలాన్ని బలంగా నమ్మి నడుస్తున్న జనసైన్యంతో 30న బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు, వీటితోపాటు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి ‘ సేనతో సేనాని బహిరంగ సభ కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దశగా పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్ చూపిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
మరోవైపు కీలకమైన స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి భాగస్వామిగా జనసేన వైఖరిని విశాఖలో జరిగే బహిరంగ సభ ద్వారా వెల్లడించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నియోజకవర్గాలలో జనసేన,టీడీపీ సఖ్యతలోనూ కొన్ని చిక్కులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన ఏడాదిన్నర తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు కీలక సమావేశాలను ఏర్పాటు చేసుకుంది జనసేన. పవన్ కల్యాణ్ సమక్షంలో జరిగే ఈ మీటింగ్స్ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.







