Jagan: ఎన్నికల తర్వాత మొదటిసారి తప్పులపై జగన్ స్పష్టీకరణ..
రాజకీయాల్లో తప్పులు జరుగటం సహజమే. ముఖ్యంగా ఒక పార్టీ లేదా నాయకుడు పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ వాటిని గుర్తించి ముందుకు ఎలా సాగాలి అనేది అత్యంత కీలకం. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) మొదటిసారిగా కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు జరిగాయని అంగీకరించినట్టు సమాచారం రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
వివిధ పట్టణాలలో, కార్పొరేషన్లలో వైసీపీ (YCP) తన బలం కోల్పోతున్న పరిస్థితిలో గురువారం జరిగిన అంతర్గత సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి జగన్ అత్యంత నమ్మకమైన కొద్దిమందినే పిలించినట్టు తెలుస్తోంది. సమావేశంలో ఆయన ముందుగా రాసుకున్న కొన్ని ముఖ్యాంశాలను నాయకులకు వివరించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో పార్టీ చేసిన పొరపాట్లపై ఆయన స్పష్టంగా స్పందించినట్టు తెలిసింది.
ఈ సమావేశంలో “కొన్ని నిర్ణయాలు నాకు తెలియకుండానే జరిగాయి. అందరినీ నమ్మడం కూడా ఒక తప్పే. కొన్ని విషయాల్లో మనం నాయకులను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయాం. కొన్ని అంశాలు నన్ను చేరకపోవడం కూడా పార్టీకి నష్టం తెచ్చింది. తప్పులు జరిగినా, చుట్టుపక్కల వారు అన్ని బాగానే ఉన్నాయని చెప్పడం పరిస్థితి మరింత కష్టతరం చేసింది,” అని జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
మొదటిసారి తప్పులు జరిగాయనేది ఆయన ఒప్పుకోవడం మాత్రం పెద్ద మార్పుగా భావిస్తున్నారు. అలాగే గతంలో పార్టీని బలోపేతం చేసిన కొంతమందిని దూరం చేసిన విషయంలో కూడా అంతర్గతంగా చర్చ జరిగిందని సమాచారం. అయితే వారిని తిరిగి చేరదీయాలన్న ఆలోచన జగన్ వద్ద లేనట్లు తెలుస్తోంది. “వెళ్లిన వారిని పిలిచే ప్రసక్తి లేదు. ఇప్పుడు మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను. ఇక మీరు నిర్ణయాలు తీసుకోండి,” అని ఆయన నాయకులకు చెప్పినట్టు టాక్.
ఈ వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తు వ్యూహాలు ఏ దిశగా ఉంటాయనే ఆసక్తిని పెంచాయి. తప్పులు జరిగినాయని అంగీకరించడం ఒక మంచి లక్షణమే అయినా, వాటి సవరణలో ఏ చర్యలు తీసుకుంటారు అన్నదే ఇప్పుడు కీలకం. ప్రజల్లో తిరిగి విశ్వాసం పొందాలంటే వైసీపీ కొత్త ప్రణాళికలతో, కొత్త శైలితో ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా, జరిగిన తప్పులపై జగన్ అంగీకారం పార్టీ లోపల మార్పులకు ఆరంభ సంకేతంగా భావించవచ్చు. కానీ ఆయన తదుపరి చర్యలే నిజమైన దిశను నిర్ణయిస్తాయని అన్నీ వర్గాల నోట ఒకే మాట వినిపిస్తోంది.






