YS Jagan : అమరావతిపై జగన్ మళ్లీ ‘యూ-టర్న్’..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై అమరావతి ఒక తీరని ప్రశ్నగా మిగిలిపోయింది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పరాజయానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ‘మూడు రాజధానుల’ ప్రతిపాదన, అమరావతిని విస్మరించడం ప్రధాన కారణాలని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే, ప్రజల తీర్పు తర్వాత అయినా వైసీపీ తన పంథాను మార్చుకుంటుందని ఆశించిన వారికి, జగన్ తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. కనీసం 30 వేల ఎకరాల విస్తీర్ణం ఉండాలని ఆయనే సూచించారు. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీన్ మారిపోయింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి గ్రాఫిక్స్ అని విమర్శలు చేస్తూ ‘మూడు రాజధానుల’ బిల్లును తెరపైకి తెచ్చారు. అప్పటి నుండి అమరావతి కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన రాజధానిగా వైసీపీ చిత్రీకరించడం మొదలుపెట్టింది.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, రేపు అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుండే పరిపాలిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన చూసి వైసీపీ రియలైజ్ అయ్యిందని అంతా భావించారు. కానీ, తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆశలపై నీళ్లు చల్లాయి.
అమరావతి కృష్ణానది లోపల నిర్మిస్తున్నారని, ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదని జగన్ మళ్ళీ పాత వాదనను వినిపించారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు కావాలని, అంత సొమ్ము ఖర్చు చేయడం అసాధ్యమనే రీతిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందంటూ తన ‘వికేంద్రీకరణ’ వాదనను మరోసారి పరోక్షంగా సమర్థించుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జగన్ తాజా వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ను కూడా అయోమయంలో పడేస్తున్నాయి. ఒకవైపు పార్టీ నేతలు రాజధానికి అనుకూలంగా మాట్లాడుతుంటే, అధినేత మాత్రం వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇదే ఆ పార్టీ సిద్ధాంతమైతే మున్ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఒకే అంశంపై పదే పదే మాట మార్చడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం సడలిపోతుంది. మూడు రాజధానుల ద్వారా ఆయా ప్రాంతాల సెంటిమెంటును రగల్చాలని చూసినా, గత ఎన్నికల్లో ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా అమరావతికే మొగ్గు చూపారు. మళ్ళీ అదే వాదనను కొనసాగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. ఇప్పటికే కోర్టుల నుండి చీవాట్లు తిన్న ఈ అంశంపై, మళ్ళీ పట్టుదలకు పోతే ఇతర పక్షాలు వైసీపీని మరింతగా టార్గెట్ చేసే అవకాశం ఉంది.
అమరావతి విషయంలో జగన్ స్టాండ్ మారలేదని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు, కానీ ‘రాజధాని’ అనే రాష్ట్ర అస్తిత్వాన్ని విస్మరించడం రాజకీయంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బే. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్పష్టమైన, స్థిరమైన విధానాన్ని ప్రకటించకపోతే వైసీపీ మున్ముందు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు.






