Kakani Govardhan Reddy: కల్తీ మద్యం కేసు నుంచి ఫోర్జరీ వరకు… కాకాణిపై కేసుల్లో కీలక డాక్యుమెంట్లు మాయం..
నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) కేసులకు సంబంధించిన ఫైళ్లు కోర్టుల్లో వరుసగా కనిపించకపోవడం మరోసారి పెద్ద చర్చగా మారింది. న్యాయవ్యవస్థలో అత్యంత భద్రతతో ఉండాల్సిన డాక్యుమెంట్లు మాత్రమే ఇలా అదృశ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో జరిగిన ఘటనలు, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు—ఇవి రెండు కలిసి కాకాణి కేసులపై కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy)పై విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని కాకాణి ఆరోపించినప్పుడు బయటపడ్డ పత్రాలు ఫోర్జరీ అని సోమిరెడ్డి కోర్టులో కేసు వేశారు. అలాంటి కీలక కేసు విచారణలో ఉండగానే కోర్టులోకి దొంగలు చొరబడి, కాకాణికి సంబంధిత పత్రాలనే తీసుకెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇతర ఏ ఫైల్‌కీ హాని జరగకపోవడం, కేవలం ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లే మాయం కావడం కారణంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సీబీఐ (CBI) దర్యాప్తు కూడా జరిగింది.
ఇప్పుడోసారి ఇదే తరహా విషయం తిరిగి బయటపడటంతో మళ్లీ చర్చ మొదలైంది. 2014 ఎన్నికల సమయంలో నమోదైన కల్తీ మద్యం కేసుకు సంబంధించిన కీలక పత్రాలు కోర్టు రికార్డుల నుంచి గల్లంతయ్యాయని 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టు (Vijayawada Special Court) గుర్తించింది. ఆ సమయంలో ఆ పత్రాలను తిరిగి భర్తీ చేసే పనిని సీఐడీ (CID)కి అప్పగించారు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పక్కనపెట్టబడింది. దీంతో ఐదేళ్ల పాటు ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ కేసును తిరిగి పరిశీలించడం ప్రారంభించడంతో పరిస్థితి మారింది. ప్రస్తుతం నెల్లూరు సీఐడీ అధికారులు మిస్సయిన డాక్యుమెంట్లను సేకరించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం వస్తోంది. కాకాణితోపాటు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి (Ramireddy Prathap Kumar Reddy) కేసులకు సంబంధించిన పత్రాలు కూడా కనిపించలేదనే ప్రచారం కొనసాగుతోంది.
2014లో సర్వేపల్లి, కావలి (Kavali) ప్రాంతాల్లో కాకాణి అనుచరులు పంపిణీ చేసిన కల్తీ మద్యం తాగి పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది. గోవా (Goa) నుంచి తెచ్చిన నాసిరకం మద్యం స్థానిక లేబుళ్లతో పంపిణీ చేశారని అప్పట్లో వచ్చిన ఆరోపణలపై టీడీపీ ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది. 2017లో చార్జిషీట్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలతో ఈ కేసు 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది.
ఈ సమయంలోనే ముఖ్యమైన పత్రాలు మిస్ అయ్యాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ కేసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేగం పెంచడంతో మళ్లీ చర్చకెక్కాయి. కోర్టుల్లో వరుసగా కీలక ఫైళ్లు కనిపించకపోవడం న్యాయవ్యవస్థ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ఈ మిస్టరీ త్వరలోనే బయట పడుతుందేమో చూడాలి.
– Bhuvana






