Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం దాగుడు మూతలు

విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 1982లో మొదలైన ఈ ప్లాంట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1966లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో మొదలైన పోరాటం, 32 మంది ప్రాణాలను బలిగొంది. ఉద్యమానికి తలొగ్గిన ఇందిరా గాంధీ.. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1990లో మొదటి బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభమైంది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం దీనిసొంతం. ఈ ప్లాంట్ కు 20వేల ఎకరాల భూమి ఉంది. రెండు పోర్టుల సమీపంలో ఉండటం వల్ల ఎగుమతులకు అత్యంత అనుకూలంగా ఉంది. అయితే.. 2021లో కేంద్రం దీన్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించింది.
2021 జనవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) వందశాతం స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరించనున్నట్టు వెల్లడించారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాస్త వెనక్కు తగ్గినట్లు అర్థమైంది. 2024 అక్టోబర్‌లో పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో రూ.10,300 కోట్లు ఈక్విటీ, రూ.1,140 కోట్లు లోన్ కన్వర్షన్ గా కేటాయించారు. ఈ ఏడాది మార్చిలో రూ.6,783 కోట్లు విడుదల చేశారు.
అదే సమయంలో ప్లాంట్‌లో కార్మికులను భారీగా తగ్గించేస్తున్నారు. ప్లాంట్లో మొత్తం 12,600 పెర్మనెంట్, 14,000 కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. 2024 సెప్టెంబర్‌లో 4,500 కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించారు. అయితే కార్మికుల ఉద్యమాలతో దిగొచ్చింది కేంద్రం. ఆ 4,200 మందిని మళ్లీ చేర్చుకున్నారు. కానీ, 2025 మేలో 2,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించారు. షో-కాజ్ నోటీసులు, సస్పెన్షన్లు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు గుడ్ బై చెప్పేస్తున్నారు. 8 నెలలుగా 25% సాలరీలు మాత్రమే చెల్లిస్తున్నారు. VRS ద్వారా 1,620 మందిని తొలగించినట్లు అంచనా. వీళ్లకోసం రూ.506 కోట్లు కేటాయించారు. అంతేకాక.. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము వెనుకంజ వేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.
కానీ రాష్ట్రంలో కూటమి నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేదని చెప్తున్నారు. 2024 మండలి సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అమిత్ షాతో మాట్లాడి ఆపినట్లు ప్రకటించారు. అంతేకాక ప్యాకేజీ కూడా ప్రకటించామని టీడీపీ (TDP) నేతలు చెప్తున్నారు. ఇవన్నీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమేనని ప్రకటిస్తున్నారు. కానీ కార్మికుల్లో అనుమానాలు మాత్రం తొలగట్లేదు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ (YCP), కాంగ్రెస్ పార్టీలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ప్రైవేటీకరణపై ఢిల్లీలో ఒకలాగా, రాష్ట్రంలో మరోలాగా కూటమి నేతలు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదనుకుంటే వెంటనే క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ (AMNS) స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలంటూ చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కావాలని ఎందుకు కోరలేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. వీటన్నిటినీ చూస్తే కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ పై దాగుడు మూతలు ఆడుతున్నట్టు అర్థమవుతోంది.