Chandrababu: దేశం గర్వపడేలా అమరావతి : చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి (Amaravati)లో 15 బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు (Chandrababu) మాట్లాడారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేందుకు కేంద్రప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు. రాబోయే ఐదేళ్లు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవటంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో రెండేళ్లు పొడిగించాలని నిర్మలాసీతారామన్‌ను విజ్ఞప్తి చేశారు.
ఏపీలో జగన్ హయాంలో ఐదేళ్లు విధ్వంసం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చి రాజధాని పనులను పునఃప్రారంభించారు. కేంద్ర సహకారంతోనే అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2028 మార్చి నాటికి పూర్తిచేసేలా పనులు జరుగుతున్నాయి. పనుల వేగవంతానికి ఆర్థిక మంత్రి నిర్మల ముఖ్యకారణం. మాకంటే వేగంగా అమరావతికి రూ.15వేల కోట్ల నిధులిచ్చారు. దేశ ఆర్థికవ్యవస్థను నిర్మల గాడిన పెడుతూ వస్తున్నారు. ఇక్కడున్న ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదు. వినూత్నమైన నగరాన్ని నిర్మిస్తున్నాం. రూ.1,334 కోట్లతో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయి. బ్యాంక్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండటంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని నిర్మలా సీతారామన్ బయటకు తీసుకొచ్చారు. ఏపీ ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉంది. అమరావతి నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుంది. సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి తయారవుతుంది. 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతాయి. 2028 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాల పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొదింస్తాం అని పేర్కొన్నారు.






