Chandrababu: సూపర్ సిక్స్ .. సూపర్ హిట్ : సీఎం చంద్రబాబు
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకాన్ని (Stree Shakti Scheme) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈరోజు గర్వంగా చెబుతున్నా సూపర్ సిక్స్, సూపర్ హిట్స్ అయ్యింది. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. వైసీపీ (YCP) పాలనలో ప్రజలు ఐదేళ్ల పాటు నవ్వడమే మరిచిపోయారు. ఇంటా, బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయింది. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటాం అని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టాం. మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. మహిళా సాధికారిత కోసమే డ్వాక్రా, మెప్పా సంఘాలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ కండక్టర్లు (RTC conductors ) గా తొలుత మహిళలను తీసుకున్నది మేమే. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు (RTC drivers ) గా కూడా రావాలి. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాం అని సీఎం చంద్రబాబు అన్నారు.







