Chandrababu: సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే
ఆర్టీసీలో సేవలు మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోండి
డ్రోన్ సేవలు మరింత విస్తృతపరచాలి
ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు
అమరావతి: వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్లోనే అందజేయాలన్నారు. ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పని తీరు పట్ల సంతృప్త స్థాయి పెరుగుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలందిస్తున్నాయని అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకుని ప్రజలకు ఆన్లైన్లో సేవలందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యమెంట్లు కొరియర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలన్నారు. బస్టాండు ప్రాంగణం, పరిసరాలు, టాయ్లెట్ల వద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు ఉండాలని సీఎం అన్నారు. డ్రోన్ సేవలు మరింత విస్తృత పరిచాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
భవిష్యత్తులో డ్రోన్ల ఉపయోగం గణనీయంగా పెరుగుతుందన్నారు. పురుగు మందుల వినియోగం తగ్గించేందుకు డ్రోన్లను ఎలా వాడుకోవచ్చోననే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్యం నిర్వహణ ద్వారా వ్యాధుల వ్యాప్తి లేకుండా చేయవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది అధికారులు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని… అలాగే కొందరు అవలంభించే మంచి పద్దతులను గుర్తించి మిగిలిన జిల్లాల్లో కూడా అమలయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






