Chandrababu: కొత్త నినాదం ఇచ్చిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) కు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. విశాఖ(Vizag)లో మరో కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా తదితర రంగాల్లో అపారమైన అవకాశాలను చాటిచెప్పేలా టీపీసీఐ సదస్సును నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
త్వరలోనే సీ కేబుల్ , డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయన్న ఆయన.. ప్రపంచవ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమ విలువ 8 ట్రిలియన్ డాలర్లుగా ఉందని తెలిపారు. 2030 నాటికి 700 బిలియన్ల డాలర్లకు దేశంలోని ఆహారశుద్ధి పరిశ్రమ చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోందన్నారు. అయితే ఈ రంగంలో దేశం ఇంకా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏపీ 9% వాటాతో 50 బిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉందన్న ఆయన.. జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏ రూ. 5.19 లక్షల కోట్ల మేర ఉందని తెలిపారు.
ఏపీ జీఎస్డీపీలో 35 శాతం మేర వాటాను వ్యవసాయం అనుబంధ రంగాలు కలిగి ఉన్నాయన్నారు. ఏపీ ప్రస్తుతం ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందని, త్వరలోనే మొత్తం ఉత్పత్తిలో 25 శాతానికి చేరుకుంటామని తెలిపారు. 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ చేస్తున్న ఏపీ దేశానికే ఆక్వా హబ్ గా ఉందన్నారు. ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అందిపుచ్చుకోవాలన్నారు. పట్టణీకరణ, జీవనశైలి, తలసరి ఆదాయాలు కొత్త అవకాశాలకు దారితీస్తున్నాయని తెలిపారు.
ఏపీలోని చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర జిల్లాలు, విశాఖలలో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకూ, కాఫీ లాంటి క్లస్టర్లు ఉన్నాయని, గ్లోబల్ బ్రాండ్స్ ఫ్రమ్ ఇండియా బై ఇండియన్స్ అనేది మన నినాదం కావాలన్నారు. ఏపీలో అంతర్జాతీయస్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టం ఉందన్నారు. 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, 33 లక్షల టన్నుల గోదాముల సామర్ధ్యం ఉందని తెలిపారు. 175 నియోజక వర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు.