Chandrababu: దేశానికి గేట్వేలా ఎపి: సీఎం చంద్రబాబు
దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అలాగే పెట్టుబడులసాధనకోసం అవసరమైన అన్నీచర్యలను చేపట్టామని చెప్పారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని వివరించారు. పెట్టుబడులకు అవసరమైన సంస్కరణలు కూడా తెచ్చామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఏపీలో ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సావరిన్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు.
ఈ సమ్మిట్ మేథోపరమైన చర్చలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. ‘విశాఖను సురక్షితమైన నగరంగా కేంద్రం ఇటీవల ప్రకటించింది. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. పెట్టుబడిదారుల లక్ష్యంగా మన రాష్ట్రం ఎదుగుతోంది. ప్రధాని మోదీ పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉంది. 2047లోగా మనదేశం నంబర్ వన్ ఎకానమీ అవుతుంది. ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే తిరుగులేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. గ్రీన్ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందుంటున్నారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుంది. ఏపీకి అనేక కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.






