Chandrababu: అమరావతిలో పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సీఎం సూచించారు. బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ పై సీఎం సమీక్ష నిర్వహించారు. గత పాలనలో రాజధాని కోసమే రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని.. వారికి ఏమైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని సీఆర్డీఏ, పురపాలక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో వారితో సమావేశమై ఇబ్బందులు తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రికి, అధికారులకు స్పష్టం చేశారు.
రైతులు త్యాగం చేసిన ప్రభుత్వానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం తరపున అదే స్థాయి సహకారం అందాలని అన్నారు. అపరిష్కృతంగా ఏమైనా అంశాలు ఉంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని ఆదేశించారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని సూచించారు. నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు. అంతిమంగా అమరావతి ప్రపంచ శ్రేణి నగరంగా తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.






