Chandrababu: పేదలకు కోసం దసరా కానుక రెడీ చేస్తున్న చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తన పాలనలో తేడా చూపిస్తున్నారు. గతంలో ఆయన ప్రకటించిన హామీలు అమలు కావడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టులు, మరోవైపు పేదల సంక్షేమం రెండూ సమాంతరంగా నడుస్తున్నాయి. బాబు ఈసారి తాను చెప్పిన మాటలను వెంటనే నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో వైసీపీ (YCP) కి, ప్రత్యేకంగా జగన్ (Jagan ) కు బాబును విమర్శించడానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది అన్న టాక్ నడుస్తోంది.
ఈ పండుగల సీజన్లో పేదలకు నిజమైన శుభవార్త అందించడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యంగా దసరా (Dasara) పండుగ సమయానికి మూడు లక్షల ఇళ్లు పేదలకు అందించడానికి చర్యలు వేగవంతం చేసింది. ఇళ్లు సిద్ధం చేయడానికి అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దసరాకు లబ్దిదారులు కొత్త ఇళ్లలో గృహప్రవేశం చేయాలని ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది. ఇప్పటికే పనులు చివరి దశలోకి చేరడంతో పండుగ నాటికి ఈ లక్ష్యం నెరవేరుతుందని చెబుతున్నారు.
దసరాతో ఆగిపోకుండా, సంక్రాంతి (Sankranthi) పండుగకు మరో రెండు లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వేళ మరింత మంది తమ సొంత ఇళ్లలో పండుగ చేసుకునేలా ప్రణాళికలు వేస్తోంది. అధికారులను ఇప్పటి నుంచే ఆ దిశగా కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దీంతో 2025-2026 ఆర్థిక సంవత్సరాంతానికి మరో ఐదు లక్షల ఇళ్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే వచ్చే మార్చి నెలాఖరుకు పది లక్షల ఇళ్లు నిర్మించి అందించనుంది. ఆరు నెలల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో ఇళ్లు కట్టించి పేదలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా జరగని విషయం అని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కనీసం యాభై లక్షల మందికి పైగా కుటుంబ సభ్యులు శాశ్వత గృహాలను పొందనున్నారు.
నిధుల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అవసరమైన బడ్జెట్ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ నిర్మాణ పనులు ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పైగా పాలనాపరమైన నిర్ణయాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటోంది. అందువల్ల ఇళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన ఒక నెలలో మూడు లక్షల ఇళ్లు పూర్తవుతాయని అధికార వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి.
ఇకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇళ్లను అందించడం పేదల జీవన ప్రమాణాలను మార్చే అడుగుగా భావిస్తున్నారు. చాలా మంది బాటసారిలా ఉంటూ గూడుల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇంత తక్కువ కాలంలో సొంత ఇళ్లు ఇచ్చి ప్రభుత్వం విశేషమైన పేరు తెచ్చుకోబోతోందని విశ్లేషకులు అంటున్నారు. ఒక రకంగా ఇది పేదలకు దసరా కానుకగా మారింది.







