TDP: ఎట్టకేలకు దిద్దుబాటు చర్యల్లో చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ (TDP) చరిత్రను నిశితంగా గమనిస్తే ఒక విచిత్రమైన, పునరావృతమయ్యే పోకడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించే పోరాట పటిమ, వ్యూహరచన, కార్యకర్తల్లో ఉండే కసి… అధికారం అందగానే ఒక్కసారిగా సడలిపోతుంటాయి. చంద్రబాబు నాయుడు (Chandrababu) ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కగానే పూర్తిగా పరిపాలనా దక్షుడిగా మారిపోతారు, పార్టీ అధినేతగా వెనుకబడిపోతారు. గతంలో ఇదే వైఖరి వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిన సందర్భాలను స్వయంగా చంద్రబాబే అంగీకరించారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, పాత తప్పులే పునరావృతమవుతున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు ఈ ప్రమాద ఘంటికలను చంద్రబాబు గుర్తించడం, లోపాలను సరిదిద్దేందుకు చర్యలు ప్రారంభించడం ఇప్పుడు ఆసక్తికర పరిణామం.
ప్రస్తుతం టీడీపీలో అత్యంత బలహీనమైన అంశం కమ్యూనికేషన్ స్ట్రాటజీ లేకపోవడం. అంతేకాదు.. పార్టీ లైన్ ను నిర్దేశించే వ్యవస్థ లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలోనూ పార్టీ యంత్రాంగం తడబడుతోంది. ఇందుకు ప్రధాన కారణం అధికార ప్రతినిధులకు సరైన సమాచారం అందకపోవడమే. ఏ అంశంపై ఎలా స్పందించాలి? పార్టీ స్టాండ్ ఏమిటి? అనేది చెప్పేవారు లేరు. దీంతో టీవీ డిబేట్లలో, ప్రెస్ మీట్లలో నేతలు నీళ్లు నమలాల్సి వస్తోంది.
ఇటీవల జరిగిన రిపబ్లిక్ టీవీ వివాదం టీడీపీలోని ఈ సమన్వయ లోపానికి అద్దం పట్టింది. వాస్తవానికి జాతీయ స్థాయిలో టీడీపీకి, అర్నాబ్ గోస్వామికి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, ఒక డిబేట్ లో పార్టీ నేత దీపక్ రెడ్డి అనవసరంగా మంత్రి నారా లోకేశ్ పేరును ప్రస్తావించడం, దాన్ని అర్నాబ్ తనకు అనుకూలంగా మలుచుకుని వివాదం చేయడం చకచకా జరిగిపోయాయి. నిజానికి అదొక చిన్న విషయం. దాన్ని అక్కడితో వదిలేస్తే సరిపోయేది. కానీ, పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో, సోషల్ మీడియా విభాగం, కేడర్ దీన్ని ఒక యుద్ధంలా మార్చేశారు. ఫలితంగా అనవసరంగా ఒక నేషనల్ మీడియా హౌస్ తో వైరం పెట్టుకున్నట్లయింది. అధికారికంగా ప్రకటించకపోయినా, బాయ్ కాట్ చేసే స్థాయికి వెళ్లడం పార్టీకి నష్టం చేకూర్చేదే తప్ప లాభించేది కాదు. సరైన సమయంలో, సరైన దిశానిర్దేశం చేసే వ్యవస్థ ఉండి ఉంటే ఈ వివాదానికి మొదట్లోనే ఫుల్ స్టాప్ పడేది.
మరోవైపు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ప్రతిపక్షం గట్టిగా దాడి చేసింది. ప్రభుత్వం వద్ద ఎన్ని సమర్థవంతమైన కారణాలు ఉన్నా, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో పార్టీ విఫలమైంది. ఈ విషయంలోనూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నామని, విపక్షాల నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకోలేకపోతున్నామని ఆయన గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన అధికార ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ ను కన్వే చేసేవాళ్లు లేకుండా పోయారని నిర్మొహమాటంగా అంగీకరించారు. ఈ లోపాన్ని సరిదిద్దడానికి బీజేపీ తరహాలో వ్యవస్థీకృతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం తక్షణ పరిష్కారంగా ఒక కొత్త వ్యవస్థను తెరపైకి తెచ్చారు. ఇద్దరు మంత్రులు, ఇద్దరు పార్టీ సీనియర్ నేతలతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలపై ఈ బృందం ఎప్పటికప్పుడు పార్టీ అధికార ప్రతినిధులకు బ్రీఫింగ్ ఇస్తుంది. తద్వారా మీడియాలోనూ, ప్రజల్లోనూ ఒకే రకమైన వాదనను బలంగా వినిపించడానికి ఆస్కారం ఉంటుంది.
మొత్తానికి, పాలనలో పడి పార్టీని గాలికి వదిలేస్తారనే అపవాదును చెరిపేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం లేకపోతే, అధికారం ఉన్నా అది పార్టీకి భారంగానే మారుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు సమస్యను గుర్తించి, డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగడం శుభపరిణామం. ఈ కొత్త విధానం ఎంత సమర్థవంతంగా అమలవుతుందో, టీడీపీ వాయిస్ ను ఎంత బలంగా వినిపిస్తుందో వేచి చూడాలి.






