Amaravathi: అమరావతి అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా బుల్లెట్ ట్రైన్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) రాబోయే రోజుల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని ప్రభుత్వం రాజధానిని అన్ని రంగాల్లో ఆధునికంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లు, రైల్వేలు, విమాన సౌకర్యం, నదీమార్గ రవాణా – అన్నింటినీ సమన్వయం చేస్తూ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు రాష్ట్రానికి పెద్ద అవకాశంగా మారబోతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మెట్రో నగరాలను కలిపేలా హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబై (Mumbai) – అహ్మదాబాద్ (Ahmedabad) మధ్య ఇప్పటికే 508 కిలోమీటర్ల బుల్లెట్ రైలు మార్గం పనులు జరుగుతుండగా, అది 2026 నాటికి కొంతవరకు పూర్తి కానుందని చెబుతున్నారు. అదే తరహాలో హైదరాబాద్ (Hyderabad), చెన్నై (Chennai), బెంగళూరు (Bengaluru) వంటి ప్రధాన నగరాలను కలిపే కొత్త మార్గాలపై రూట్ మ్యాప్ సిద్ధమైంది.
హైదరాబాద్ – చెన్నై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ప్రతిపాదనలో అమరావతికి ప్రాధాన్యం దక్కింది. ఈ మార్గం అమరావతి మీదుగా వెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అమరావతి భవిష్యత్తులో మెట్రో సిటీగా ఎదగడానికి పెద్ద ప్లస్ అవుతుంది. ఈ రైలు మార్గం శంషాబాద్ (Shamshabad), నార్కటపల్లి (Narketpalli), సూర్యాపేట (Suryapet), ఖమ్మం (Khammam) లేదా కోదాడ (Kodad) మీదుగా అమరావతికి చేరుకుంటుందని సమాచారం. తర్వాత గుంటూరు (Guntur), చీరాల (Chirala) మీదుగా చెన్నై దిశగా వెళుతుంది.
ఈ కారిడార్ మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవుతో ఉండబోతోంది. ఇందులో తెలంగాణ (Telangana)లో 6 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 8 స్టేషన్లు, తమిళనాడు (Tamil Nadu)లో ఒక స్టేషన్ ఉంటాయని ప్రతిపాదించారు. గుడూరు (Gudur) నుంచి తిరుపతి (Tirupati) వైపు మార్గాన్ని విస్తరించే ఆలోచన కూడా ఉంది. అలా చేస్తే శ్రీవారి భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, శ్రీసిటీ (Sri City) పారిశ్రామిక కేంద్రానికి కూడా రవాణా సౌకర్యం లభిస్తుంది. ఈ విస్తరణ వల్ల మరో 53 కిలోమీటర్లు పెరగనుందని చెబుతున్నారు.
ఇక హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేకి సమాంతరంగా తీసుకువెళతారు. ఈ మార్గం కర్నూలు (Kurnool), అనంతపురం (Anantapur) మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. మొత్తం 13 స్టేషన్లు ఉండే ఈ ప్రాజెక్టులో సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లోని పెనుకొండ (Penukonda) సమీపంలో కియా (Kia) కంపెనీ కోసం ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది.ఈ రెండు కారిడార్లు పూర్తయితే దక్షిణ భారతదేశానికి మంచి కనెక్టివిటీ లభిస్తుంది. ముఖ్యంగా అమరావతి వంటి కొత్త రాజధాని నగరానికి బుల్లెట్ రైలు చేరడం, భవిష్యత్తులో నగర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.







