TTD: తిరుమల లడ్డు కల్తీ వివాదం.. వైసీపీ హయాంలో భారీ అవకతవకలు..దినకర్ ఆరోపణ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల (Tirumala). ఇక్కడి శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం భక్తులకి అత్యంత పవిత్రమైనవి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఒక్క క్షణమైనా శ్రీవారిని చూచి ఆ భక్తి ఆనందాన్ని పొందాలని, పవిత్ర లడ్డు రుచిని ఆస్వాదించాలని ఆశిస్తారు. అయితే ఈ రెండు విశ్వాసాలకే కాలుష్యం కలిగిందని బీజేపీ నాయకుడు లంకా దినకర్ (Lanka Dinakar) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.
ఆయన మాటల్లో, వైసీపీ (YCP) పాలనలో తిరుమల వ్యవస్థలో తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నాయట. ముఖ్యంగా దర్శన టికెట్ల విషయంలో కొందరు నాయకులు, మంత్రులు అనుచితంగా లాభాలు పొందారని ఆయన ఆరోపించారు. దర్శనానికి వెళ్లాలంటే సాధారణ భక్తులకు టికెట్లు దొరకకపోగా, కొందరు వాటిని అధిక ధరలకు అమ్ముకుని డబ్బులు సంపాదించారని ఆయన వ్యాఖ్యానించారు.
లడ్డు ప్రసాదం విషయంలో మరింత తీవ్రమైన ఆరోపణలు వెలువడ్డాయి. లంకా దినకర్ ప్రకారం, అప్పటి తిరుమలలో వాడిన నెయ్యి నాణ్యత లేని దానిగా మారిందట. తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిని భోలే బాబా డెయిరీ (Bhole Baba Dairy) అనే సంస్థ సరఫరా చేసిందని, ఆ సంస్థ ప్రభుత్వ కాంట్రాక్టు పొందిందని ఆయన తెలిపారు. ఏకంగా 24 లక్షల కిలోల నెయ్యి సరఫరా అయినప్పటికీ, ఆ నెయ్యి మూలం ఎక్కడనేది సీబీఐ (CBI) విచారణలో స్పష్టంగా తెలియలేదని చెప్పారు.
సీబీఐ అధికారులు ఆ సంస్థ నిజంగా పాలు లేదా వెన్న సేకరించిందా అని పరిశీలించగా, ఎలాంటి ఆధారాలు లభించలేదని దినకర్ తెలిపారు. అంటే అసలు పదార్థాలు కాకుండా నకిలీ వస్తువులను వాడిన నేతిని లడ్డూలు తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం అవినీతి కాదు, భక్తుల విశ్వాసానికి జరిగిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతమైంది. అప్పటి టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో అన్నదానిపై అందరి దృష్టి పడింది.
ఇక ఈ ఆరోపణలు రాజకీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇప్పటికే ఈ అంశంపై స్పందించినట్లు గుర్తుచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా గతంలో దీని పై నిరసన వ్యక్తం చేశారని దినకర్ పేర్కొన్నారు. మొత్తానికి, తిరుమల శ్రీవారి సేవలో జరిగిన అవకతవకలు భక్తుల మనసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు పూర్తి నివేదిక వచ్చే వరకు ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.







