Bill Gates: చంద్రబాబును ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (AP CM Chandrababu) మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత దాత బిల్ గేట్స్ (Bill Gates) ప్రశంసిస్తూ లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో (Bill and Milinda Gates Foundation) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) చేసుకున్న ఒప్పందం సందర్భంగా ఈ లేఖ రాశారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సాంకేతికత ఆధారిత పురోగతికి దోహదపడనుందని గేట్స్ అభినందించారు. చంద్రబాబు దూరదృష్టి, చిత్తశుద్ధి, సాంకేతిక ఆవిష్కరణలపై ఆసక్తిని బిల్ గేట్స్ తన లేఖలో కొనియాడారు. “పాలనలో సాంకేతికత, ఇన్నోవేషన్‌ను బలోపేతం చేసేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు మీరు చూపిన చొరవ మీ విజన్‌కు నిదర్శనం. ఆరోగ్యం, విద్య, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అభినందనీయం,” అని గేట్స్ లేఖలో (Bill Gates Letter) పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య రంగంలో డిజిటలైజేషన్, ఏఐ ఆధారిత క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్‌టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడం, వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మోనిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి మైక్రోన్యూట్రీయంట్లు అందించే అంశాలపై చర్చలు జరిగాయి. ఈ ఒప్పందం ద్వారా పేదలు, అట్టడుగు వర్గాలకు మెరుగైన విద్య, ఆరోగ్య సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఢిల్లీలో మంచి వాతావరణంలో సంప్రదింపులు జరిగాయని, ఢిల్లీకి వచ్చినందుకు చంద్రబాబు గారికి, ఆయన బృందానికి ధన్యవాదాలు అని బిల్ గేట్స్ లేఖలో పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన పురోగతి సాధించగలమని నమ్ముతున్నట్టు తెలిపారు. ఆయన తన తదుపరి భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించే సమయానికి ఈ ఒప్పందం ద్వారా సానుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు గతంలోనూ బిల్ గేట్స్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో గేట్స్‌తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఏఐ రంగాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా గేట్స్ తన రాబోయే పుస్తకం ‘సోర్స్ కోడ్’ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్ట్ పై స్పందిస్తూ చంద్రబాబు, “బిల్ గేట్స్ ఇచ్చిన ఈ పుస్తకం స్ఫూర్తిదాయకం” అని ట్వీట్ చేశారు.
ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కు కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే కాకుండా, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ వంటి అంశాలు బలోపేతం కానున్నాయి. ఈ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే కాక, అల్పాదాయ దేశాలకు ఒక ఆదర్శంగా నిలపనున్నాయని గేట్స్ అభిప్రాయపడ్డారు. బిల్ గేట్స్ తో సహకారం రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, గ్లోబల్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆవిష్కరణ కేంద్రంగా నిలపనుందని ఆశిస్తున్నారు.