YSRCP: మిథున్ రెడ్డి అరెస్టుతో డీలాపడిన వైసీపీ..!? వాట్ నెక్స్ట్..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి ఇటీవలి పరిణామాలు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. జగన్ (YS Jagan) హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ. 3,200 కోట్ల లిక్కర్ స్కాం కేసులో పార్టీ ఎంపీ, కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు (Mithun Reddy Arrest) కావడం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఈ అరెస్టు పార్టీని రాజకీయంగా, నైతికంగా రక్షణాత్మక స్థితిలోకి నెట్టేసింది. ఇన్నాళ్లూ స్కాం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఎదురుదాడి చేసిన వైసీపీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దాఖలు చేసిన 300 పేజీల ఛార్జ్‌షీట్‌ను చూసిన తర్వాత ఒక్కసారిగా డీలాపడింది.
రాజంపేట లోక్‌సభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి జులై 19న విజయవాడలో సిట్ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు విచారణ అనంతరం అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో సిట్ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో, మిథున్ రెడ్డి మద్యం పాలసీ రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారని, డిస్టిలరీల నుంచి కమిషన్ల రూపంలో భారీ మొత్తాలు సేకరించారని పేర్కొంది. ఈ నిధులను రియల్ ఎస్టేట్, సినిమా, ఇతర పరిశ్రమలలో పెట్టుబడులుగా మళ్లించినట్లు సిట్ తెలిపింది. అంతేకాక, దుబాయ్‌తో సహా విదేశాల్లో ఆస్తుల కొనుగోలు కూడా జరిగినట్లు ఆరోపించింది.
సిట్ సేకరించిన సాక్ష్యాలలో నగదు లావాదేవీలకు సంబంధించిన విజువల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (RFSL) నివేదికలు ఉన్నాయి. ఈ ఆధారాలు మిథున్ రెడ్డితో పాటు ఇతర నిందితులను ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు, వీరిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A1) వంటి ప్రముఖులు ఉన్నారు.
ఈ అరెస్టు తర్వాత వైసీపీ నాయకత్వం డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ స్కాం ఆరోపణలను రాజకీయ కుట్రగా, కక్షసాధింపుగా వైసీపీ విమర్శించింది. జగన్ కూడా ఈ అరెస్టును అక్రమం, కల్పితం అని పేర్కొన్నారు. మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి అని, ఈ కేసు ప్రజల కోసం నిలబడే నాయకులను అణచివేసే ప్రయత్నమని ఎక్స్ లో ఆరోపించారు. అయితే, సిట్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఆధారాలు, ముఖ్యంగా మద్యం పాలసీలో మార్పులు, ఆర్డర్ ఫర్ సప్లై (OFS) విధానాన్ని ఆటోమేటెడ్ నుంచి మాన్యువల్‌గా మార్చడం, హవాలా లావాదేవీలు వంటి విషయాలు వైసీపీ వాదనలను బలహీనపరిచాయి.
సిట్ అడిగిన కీలక ప్రశ్నలకు నిందితుల వద్ద సమాధానాలు లేవు. మద్యం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి ఎందుకు తీసుకొచ్చారు? బ్రాండెడ్ మద్యాన్ని ఎందుకు నిషేధించారు? డిజిటల్ లావాదేవీలను ఎందుకు నిరాకరించారు? వంటి ప్రశ్నలు వైసీపీ నాయకత్వాన్ని ఇరుకున పడేశాయి. ఇటీవల పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ మద్యం పాలసీ తమ పార్టీ నిర్ణయమని ప్రకటించడం వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ వ్యాఖ్యలు పార్టీని మరింత చిక్కుల్లోకి నెట్టాయి.
ఈ కేసులో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చాకచక్యంగా అడుగులు వేస్తున్నారని, అన్ని ఆధారాలను జాగ్రత్తగా సేకరించిన తర్వాతే ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసు కొలిక్కి వచ్చే వరకూ నేతలెవరూ దీనిపై మాట్లాడొద్దని చంద్రబాబు సూచించడం ఆయన వ్యూహానికి అద్దం పడుతోంది. సిట్ దర్యాప్తు ఇప్పుడు జగన్ వరకూ వచ్చి ఆగింది. తదుపరి అరెస్టు జగనే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జోక్యం చేసుకుని నివారిస్త తప్ప జగన్ అరెస్టు ఖాయమని సమాచారం. దీంతో వైసీపీ పూర్తిగా డీలాపడిపోయింది.