Super 6: సూపర్ సిక్స్ హామీలు… అమలుకు చంద్రబాబు సర్కార్ ఆపసోపాలు..!!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) నాయకత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ (Super Six) హామీలతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేతృత్వంలోని ప్రభుత్వం ఈ హామీలను అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఏడాది గడుస్తున్నా ఒక్క ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) పథకం తప్ప మిగిలిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడం, అప్పుల భారం మధ్య ఈ పథకాల అమలు కత్తిమీద సాములా మారింది.
తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని టీడీపీ (TDP) ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. వాటిని విస్తృతంగా ప్రచారం చేసింది. తమ విజయానికి బాటలు వేస్తాయని నమ్మింది.
1. ఆడబిడ్డ నిధి: 18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చెల్లింపు.
2. దీపం పథకం: ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.
3. మహిళలకు ఉచిత బస్సు రవాణా: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
4. తల్లికి వందనం: పాఠశాల విద్యార్థులకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం.
5. అన్నదాత సుఖీభవ: రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం.
6. యువగళం: నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి, 20 లక్షల ఉద్యోగాల సృష్టి.
… ఇవీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.
అయితే… సూపర్ సిక్స్ లో భాగంగా 2024 నవంబర్ 1 నుంచి దీపం 2.0 (Deepam 2.O) పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. దీని కోసం రూ.2,684 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇది సాఫీగా అమలవుతోంది. ఇకపై ముందస్తుగానే నగదు చెల్లించాలని ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక.. మహిళలకు ఉచిత బస్సు (Free Bus) రవాణా పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు. ఈ పథకం కోసం ఏపీఎస్‌ఆర్‌టీసీకి (APSRTC) సుమారు రూ.2,000 కోట్ల వార్షిక రీఎంబర్స్‌మెంట్ అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ పథకం అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ కీలకం కాగా, వాటిని ఎలా భర్తీ చేస్తుందనేదానిపై క్లారిటీ లేదు.
ఆడబిడ్డ నిధి (నెలకు రూ.1,500), తల్లికి వందనం (రూ.15,000 విద్యార్థులకు), అన్నదాత సుఖీభవ (రైతులకు రూ.20,000), యువగళం (నిరుద్యోగ భృతి రూ.3,000) పథకాలపై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటనలు లేవు. ఈ పథకాలను 2025 జూన్ నాటికి అమలు చేస్తామని గతంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ హామీల అమలుకు రూ.60,000 కోట్ల వరకూ వ్యయం అవుతుందని విశ్లేషకుల అంచనా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీన్ని మోసే పరిస్థితిలో లేదు.
2024-25లో రాష్ట్ర రుణ భారం రూ.9.74 లక్షల కోట్లుగా ఉందని, రాబడి-వ్యయ లోటు రూ.1.46 లక్షల కోట్లుగా ఉందని టీడీపీ విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది. 2024-25 బడ్జెట్‌లో రూ.2.94 లక్షల కోట్లతో సూపర్ సిక్స్ హామీలకు తగినంత నిధులు కేటాయించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. సామాజిక పెన్షన్లకే రూ.4,500 కోట్లు, ఉద్యోగుల జీతాలకు రూ.6,000 కోట్లు అవసరమని, ఈ హామీల అమలుకు అదనపు వనరులు కీలకమని నిపుణులు చెబుతున్నారు.
అయితే సంపద సృష్టించి ఈ హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్తున్నారు. రూ.4.96 లక్షల కోట్ల పెట్టుబడులతో 4.51 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే సూపర్ సిక్స్ హామీల అమలు టీడీపీ సర్కార్‌కు పెద్ద సవాల్. ఆర్థిక సంక్షోభం మధ్య ఈ పథకాలను అమలు చేయకపోతే, చంద్రబాబు ప్రభుత్వం “మాట తప్పిన” ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉంది. కేంద్రంతో చర్చల ద్వారా నిధులు సమీకరించడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఇప్పుడు కీలకం. ఈ హామీల అమలు విజయవంతం కాకపోతే, ప్రజల విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది.