AP Politics: ఏపీలో రాజకీయ ‘బలి’పీఠంపై శాంతిభద్రతలు!
సాంప్రదాయంగా మన సమాజంలో బలి అనే ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన, ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. కరువు కాటకాలు వచ్చినా, అంటువ్యాధులు ప్రబలినా, లేదా గ్రామానికి ఏదైనా కీడు జరుగుతుందని భావించినా.. గ్రామ దేవతలను శాంతింపజేయడానికి, అమ్మవారి అగ్రహాన్ని చల్లార్చడానికి పెద్దలు జంతుబలులు ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ రక్తతర్పణం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఒక గాఢమైన నమ్మకం. కానీ, నేడు ఆ నమ్మకం రాజకీయ ఉన్మాదంగా రూపాంతరం చెందిందా? అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై బలంగా వినిపిస్తోంది. దైవ కార్యాలకు పరిమితం కావాల్సిన సంప్రదాయం, రాజకీయ నాయకుల ఫ్లెక్సీల ముందు రక్తతర్పణం చేసే స్థాయికి దిగజారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. సత్యసాయి జిల్లా మొదలుకొని తూర్పుగోదావరి జిల్లా వరకు పలుచోట్ల వైసీపీ శ్రేణులు చేసిన అత్యుత్సాహపు పనులు వివాదాస్పదమయ్యాయి. కేవలం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచడమో లేదా సేవా కార్యక్రమాలు చేయడమో కాకుండా, జగన్ ఫ్లెక్సీల ముందు బహిరంగంగా మేకలను నరికి, ఆ రక్తాన్ని నేలమీద పారించడం సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేసింది. సత్యసాయి జిల్లాలో జగన్ ఫ్లెక్సీ ముందు జరిగిన జంతుబలి హంగామాపై పోలీసులు తక్షణం స్పందించి కేసులు నమోదు చేయడం, ఈ వ్యవహారం సీరియస్ టర్న్ తీసుకోవడానికి నాంది పలికింది.
ఈ వివాదం అంతటితో ఆగిపోలేదు. తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో జరిగిన ఘటన మరింత సంచలనంగా మారింది. వైసీపీ అభిమానులు జగన్ ఫ్లెక్సీ ముందు జంతుబలి ఇచ్చి హంగామా చేయడాన్ని స్థానిక ఎమ్మెల్యే ముదునూరి వెంకట రాజు తీవ్రంగా తప్పుబట్టారు. బహిరంగ ప్రదేశాల్లో, రాజకీయ నాయకుల చిత్రపటాల ముందు ఇలాంటి హింసాత్మక చర్యలు సరికాదని హితవు పలికారు. అయితే, ఎమ్మెల్యే వ్యాఖ్యలను సానుకూలంగా స్వీకరించాల్సింది పోయి, వైసీపీ శ్రేణులు దానిని ఒక సవాల్‌గా తీసుకున్నాయి. “ఎవరేం పీక్కుంటారో పీక్కోండి” అనే రీతిలో, ఎమ్మెల్యే విమర్శలకు ప్రతీకారంగా మళ్లీ జంతుబలి ఇచ్చి, తమ రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇది కేవలం అభిమానం కాదు, అంతకు మించిన అహంకారం, చట్టాన్ని లెక్కచేయని తత్వం అనే విమర్శలకు దారితీసింది. పోలీసులు దీనిని సీరియస్‌గా పరిగణించి, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడం అనివార్యమైంది.
తమ కార్యకర్తలపై జరుగుతున్న అరెస్టులపై వైసీపీ నాయకత్వం భగ్గుమంటోంది. జంతుబలి ఇస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఈ క్రమంలో వారు గత సంఘటనలను తెరపైకి తెస్తున్నారు. గతంలో హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయం సాధించినప్పుడు, ఆయన అభిమానులు కూడా ఇదే తరహాలో జంతుబలులు ఇచ్చి విందులు చేసుకున్నారని, అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కదా అనేది వారి ప్రధాన వాదన. అయితే, ఇక్కడ గమనించాల్సిన సూక్ష్మమైన తేడా ఒకటుంది. సంబరాల్లో భాగంగా మాంసాహార విందు ఏర్పాటు చేయడం వేరు, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేలా, ఫ్లెక్సీల సాక్షిగా నడిరోడ్డుపై రక్తం పారించడం వేరు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని కేవలం జంతుబలిగా చూడటం లేదు. దీనిని శాంతిభద్రతల సమస్యగా పరిగణిస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వినిపిస్తున్న రప్పారప్పా తరహా రాజకీయాలకు, రౌడీయిజానికి ఇది పరాకాష్ట అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి బీభత్సమైన దృశ్యాలను సృష్టించడం ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే వీరి లక్ష్యమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలాంటి వికృత పోకడలను ఉపేక్షిస్తే, భవిష్యత్తులో రాజకీయ వేడుకలు హింసాత్మక రూపం దాల్చే ప్రమాదం ఉందని, అందుకే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.
మొత్తానికి, ఏపీ రాజకీయం ఇప్పుడు జంతుబలుల చుట్టూ తిరుగుతోంది. రాజకీయాల్లో అభిమానం ఉండొచ్చు, కానీ అది ఉన్మాదంగా మారకూడదు. నాయకుడిపై ప్రేమను చాటుకోవడానికి రక్తతర్పణాలు మార్గం కాకూడదు. అటు అధికార పక్షం శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తుంటే, ఇటు ప్రతిపక్షం దీనిని కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది. ఏది ఏమైనా, రాజకీయ పట్టింపుల కోసం మూగజీవాలను బలి ఇవ్వడం, ఆ నెత్తుటి ధారలను చూసి ఆనందించడం నాగరిక సమాజం హర్షించదగ్గ విషయం కాదన్నది మాత్రం వాస్తవం.






