AP Liquor Scam: తుది దశకు చేరుకున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..??

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case) తుది దశకు చేరుకుంది. రూ. 3,200 కోట్లకు పైగా ఆర్థిక మోసం జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో కీలక నిందితులైన కె.ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడం దర్యాప్తును మరింత తీవ్రతరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులు అరెస్టయిన నేపథ్యంలో.. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) వీరిని మూడు రోజులుగా విచారిస్తోంది. అదే సమయంలో రాజ్ కసిరెడ్డిని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా కేసులో రంగంలోకి దిగడంతో ఒత్తిడి మరింత పెరిగింది.
2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా లిక్కర్ వ్యాపారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్త లిక్కర్ పాలసీ (Liquor Policy) పేరుతో స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించి, నగదు చెల్లింపుల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించినట్లు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) ఆరోపించింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను లిక్కర్ కంపెనీల నుంచి లంచాలు సేకరించి వాటిని షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసినట్లు సిట్ గుర్తించింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున విచారణ అవసరమని బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ల బెయిల్ పిటిషన్లను నిరాకరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. నిందితుల కస్టడీ విచారణ ద్వారా కేసు వివరాలు తేల్చడం అవసరమని కోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు అధికారులు బెదిరింపులు లేదా హింసాత్మక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సిట్ గత మూడు రోజులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారిస్తోంది. వీరితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (Govindappa balaji) కూడా ఇప్పటికే అరెస్టయ్యారు.
మరోవైపు.. ఈడీ ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ లో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ డబ్బు బదిలీలు, షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. సిట్, ఈడీ సమన్వయంతో ఈ కేసులో అసలు సూత్రధారులు, లబ్దిదారులను గుర్తించే పనిలో ఉన్నాయి.
ఇప్పటివరకు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బి. చాణక్య, పైల దిలీప్, గోవిందప్ప బాలాజీలు అరెస్టయ్యారు. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. అయితే మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మొత్తానికి అన్ని వైపుల నుంచీ ఈ కేసులో దూకుడు పెరిగింది.