వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
ఆంధప్రదేశ్‌లో వలస కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి పట్ల ఉదారంగా ఉండాలన్న ఆయన.. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ 19 నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలను మానవీయ కోణంలో ఆదరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. వలస కూలీల కోసం బస్సులు సిద్ధం చేయాలన్నారు. దీని కోసం విధి, విధానాలు తయారు చేయండని అధికారులకు తెలిపారు. వలస కూలీలకు టిక్కెట్టు కూడా అడగవద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నడిచివెళ్తూ ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించిన, రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు. ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్స్ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.






