BRS: కేసీఆర్ సెంటిమెంట్ మంత్రం.. బీఆర్ఎస్ కు లాభమా..? నష్టమా..?
బీఆర్ఎస్ మరోసారి ప్రజాదరణ కోసం సెంటిమెంటు మంత్రాన్నే నమ్ముకుందా…? మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ …చంద్రబాబును టార్గెట్ చేయడం కూడా అందుకేనా…? మరి ఈ మంత్రం ఫలిస్తుందా..? గతంలోలా ప్రజలు మళ్లీ కేసీఆర్ సెంటిెమెంటును ప్రజలు గౌరవిస్తారా…? ప్రస్తుతం బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలను చూస్తుంటే ఎవరికైనా ఇదే డౌటొస్తుంది.
కృష్ణా జలాల పంపకం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే క్రమంలో కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ వెనక్కి రావడానికి కారణం చంద్రబాబు అని ఆరోపించారు. అదే సమయంలో అవసరం లేకపోయినా పెట్టుబడుల సదస్సు గురించి ప్రస్తావించారు. ఇటీవల రేవంత్ ప్రభుత్వం ఎంవోయూలపై చేస్తున్న ప్రచారాన్ని విమర్శిస్తూ.. గతంలో చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన సదస్సులో స్టార్ హోటల్ వంట మనుషులతో ఒప్పందాలు చేయించారని ఎద్దేవా చేశారు. పాలమూరును దత్తత తీసుకుని చంద్రబాబు మోసం చేశారని, కేవలం శిలాఫలకాలతోనే కాలం గడిపారని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోందని, అందుకే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని విమర్శించారు.
కేసీఆర్ వ్యూహాత్మక అడుగు?
కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబుతో ముడిపెట్టడం ద్వారా, తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఒకే దెబ్బకు ఇద్దరు ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడం ద్వారా, తానొక్కడే తెలంగాణ హక్కుల కోసం పోరాడే యోధుడినని నిరూపించుకునే వ్యూహం ఇందులో ఉందని అనుకోవచ్చు.
అయితే, ప్రధాన సమస్య అయిన కృష్ణా జలాల వివాదం కన్నా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా హైలైట్ అవ్వడం బీఆర్ఎస్కు మైనస్ అయ్యే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు, నీటి వాటాల గురించి కేసీఆర్ చేసిన లోతైన విశ్లేషణ కన్నా, చంద్రబాబుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి. దీనివల్ల చర్చ ప్రాజెక్టుల నుంచి రాజకీయ వ్యక్తిగత దూషణలకు మళ్లింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో లేని చంద్రబాబును అంతగా టార్గెట్ చేయడం వల్ల ఏపీ-తెలంగాణ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయే తప్ప, ప్రస్తుత సమస్యలకు పరిష్కారం దొరకదని సామాన్యులు భావిస్తున్నారు.






