అమెరికాలో ఆంధ్రప్రదేశ్ వాసి మృతి

అమెరికాలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే లూటీలకు ప్రయత్నిస్తున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులకు తెగపడుతున్నారు. అలాబామా రాష్ట్రంలో ఓ దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన చిట్టూరి సత్యకృష్ణ (27) ప్రాణాలు కోల్పోయారు. పాత బర్మింగ్ హోంలోని ఓ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తోన్న సత్యకృష్ణ నెల రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. సత్యకృష్ణ పని చేస్తున్న స్టోర్‌లో దోపిడికి దొంగలు యత్నించారు. ఆయుధాలు చేతబట్టి స్టోర్‌లోకి చొరబడ్డారు. అరడుగుల పొడవుతో నల్లని స్వెట్‌షర్ట్ ధరించిన దుండగుడు కాల్పుaలు జరిపాడు. బుల్లెట్లు నేరుగా తాకడంతో సత్యకృష్ణ అక్కడిక్కడే మరణించారు. సత్యకృష్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు, సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోలు రిలీజ్ చేశారు. కాల్పులు జరిపి సత్యకృష్ణ చావుకి కారణమైన దుండగుడి ఆచూకీ తెలిస్తే తెల్లడేగా కౌంటీ పోలీసులకు తెలపాలంటూ కోరారు.
సత్యకృష్ణ మృతి వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు శోశసంద్రంలో మునిగిపోయారు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణు వర్థన్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. సత్యకృష్ణ మృతి విచారకరమన్న ఆయన.. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు.