Quantum Valley: అమెరికా తరహాలో అమరావతి క్వాంటం పార్క్..బహుళజాతి సంస్థలతో చంద్రబాబు భారీ ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన సాంకేతికత రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సంకల్పం వ్యక్తం చేశారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ (Silicon Valley) తరహాలోనే అమరావతిలో (Amaravati) “క్వాంటం వ్యాలీ” (Quantum Valley) అనే విశిష్ట పార్క్‌ను నిర్మించబోతున్నట్లు ఆయన విజయవాడలో (Vijayawada) జరిగిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో ప్రకటించారు. 2026 జనవరి 1 నాటికి ఈ ప్రాజెక్టు సిద్ధం చేస్తామని, దానికి కావాల్సిన పూర్తి ఎకోసిస్టంను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ ప్రాజెక్టులో ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎల్ అండ్ టీ (L&T) లాంటి ప్రముఖ సంస్థలు భాగస్వాములవుతున్నాయని వెల్లడించారు. ఇదొక ప్రతిష్టాత్మకమైన ప్రయోగంగా నిలుస్తుందని, దీనివల్ల రాష్ట్రానికి భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధిలో అగ్రగామిగా మారే అవకాశముందని వివరించారు. వర్క్‌షాప్‌కి ఐటీ, ఫార్మా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్, నిర్మాణ రంగాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు, కేంద్ర అధికారులు కూడా హాజరయ్యారు.
చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటం కంప్యూటింగ్ అనేది మన భవిష్యత్తు అవసరాలకు సమాధానం అవుతుందని తెలిపారు. ఇది కేవలం ఒక మిషన్ తీసుకురావడమే కాదు, వ్యవసాయంలో భూమి తేమ లాంటి అంశాలు, రియల్ టైమ్ డేటా విశ్లేషణ వంటి సమస్యలకు పరిష్కార మార్గమని వివరించారు. దీని వల్ల వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్య రంగం తదితర విభాగాలన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమం కేవలం అమరావతికి మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు (Ratan Tata Innovation Hubs) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టార్టప్‌లకు అవకాశం ఉందని, కొత్త ఆవిష్కరణలకు తగిన వేదికగా ఈ హబ్‌లు ఉపయోగపడతాయని చెప్పారు. ఇటీవల క్వాంటం టెక్నాలజీపై కేంద్రం ప్రకటించిన నేషనల్ క్వాంటం మిషన్ (National Quantum Mission) తరువాతే అమరావతిలో ఈ పార్క్‌ను నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలకు, పరిశోధనకు, విద్యార్థులకు, పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పించేందుకు ఇది చక్కటి అవకాశమని పేర్కొన్నారు. చివరగా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో (Carnegie Mellon University) చదువుకున్న నారా లోకేష్ (Nara Lokesh) ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు బాధ్యతలు లోకేష్‌కు అప్పగించామని చెప్పారు.