బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ రాజకీయ ప్రస్థానం..
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ నూతనప్రధాని కీర్ స్టార్మర్ పేరు మార్మోగిపోతోంది. టోరీలను ఘోరంగా ఓడించి లేబర్ పార్టీని అధికారంలోకి తేవడంలో కీర్ స్టార్మర్ కీలకపాత్ర పోషించారు. దీంతో ఇప్పుడు స్టార్మర్ ఎవరు, ఆయన జీవితం, రాజకీయ నేపథ్యం లాంటి అంశాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఇంతకూ కీర్ స్టార్మర్ ఎవరు..?
2019 డిసెంబర్ లో లేబర్ పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్నారు కీర్ స్టార్మర్. పార్టీ ఓటమి కారణాలను అన్వేషించడంతో పాటు ఓటమి బాధ నుంచి నేతలు, కార్యకర్తలను బయటకు తీసుకొచ్చి మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఐదేళ్లలో పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ఆధునికీకరించి ‘మారిన లేబర్ పార్టీ’గా ప్రజల ముందుంచారు. ఆ నిర్విరామ ప్రయత్నమే 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీకి మళ్లీ అధికారం తెచ్చిపెట్టింది. ఆయనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది.
లేటుగా రాజకీయాల్లోకి స్టార్మర్…
61 ఏళ్ల స్టార్మర్ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో తొలిసారి ఉత్తర లండన్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే లేబర్ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ పార్టీ విజయం సాధించడంతో ప్రధానమంత్రి పదవి అందుకున్నారు. బ్రిటన్ చరిత్రలో గత ఐదు దశాబ్దాల్లో ఇంత ఎక్కువ వయసున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే తొలిసారి.
బారిస్టర్ నుంచి ప్రధాని వరకూ..
1962 సెప్టెంబరు 2న జన్మించిన స్టార్మర్ బాల్యమంతా లండన్ శివారుల్లోనే గడిచింది. తల్లి ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసేవారు. ఆమె అరుదైన వ్యాధితో బాధపడేవారు. కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లింది స్టార్మరే. న్యాయవిద్యను అభ్యసించిన ఆయన చదువు పూర్తయిన తర్వాత 2003లో నార్తన్ ఐర్లాండ్ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు.






