డెంగ్యూ విజృంభణను ముందుగా కనిపెట్టేయొచ్చు…
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య, కాలక్రమంలో ఆ మహమ్మారి ఎలా రూపాంతరం చెందుతుంది వంటి వివరాలనూ తెలుసుకోవచ్చని చైనాలోని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అసాధారణ ఉష్ణోగ్రతలనేవి ‘వాతావరణ సూచికల’ని పరిశోధకులు తెలిపారు. ఇవి మహమ్మారి విజృంభణలపై ముందస్తు హెచ్చరికలను మెరుగుపరచడానికి, ప్రతిస్పందనలపై సమగ్ర ప్రణాళికలను రచించడానికి వీలు కల్పిస్తాయన్నారు.
ప్రస్తుతం.. వాతావరణ సూచికలుగా పరిగణిస్తున్న అంశాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు వంటివి ఉన్నాయి. ఎల్నినో పోకడ కారణంగా సాగర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే.. ప్రపంచవ్యాప్తంగా దోమల సంఖ్య పెరిగి, వాటి బెడదపై ప్రభావం ఉంటుందని, తద్వారా డెంగీ వ్యాప్తి తీరు ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మహమ్మారి గురించి ముందే తెలుసుకొని, వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావడం చాలా ప్రాంతాలకు ముఖ్యమని పేర్కొన్నారు.
తాజా పరిశోధనలో భాగంగా.. 1990-2019 ఆగ్నేయాసియా, అమెరికా ఖండాల్లోని 46 దేశాల్లో ఏటా వెలుగు చూసిన డెంగీ కేసులను విశ్లేషించారు. అలాగే 2014-19 కాలానికి సంబంధించి 24 దేశాల్లోని నెలవారీ కేసులను పరిశీలించారు. మోడలింగ్ విధానం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పోకడలకు డెంగీ మహమ్మారి సమయంలో సీజనల్గా, ఏటా వెలుగుచూస్తున్న కేసులకు మధ్య సంబంధాన్ని పరిశీలించారు.
ఉష్ణమండల హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలకు డెంగీ విజృంభణలకు మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ‘‘ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ అనే ఈ సూచికను తెరపైకి తెచ్చారు. ఉష్ణమండల హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సాగర ఉపరితల ఉష్ణోగ్రతల ప్రాంతీయ సరాసరిని ఇది సూచిస్తుంది. ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని డెంగీ మహమ్మారులతో దీనికి దగ్గర సంబంధం ఉన్నట్లు గుర్తించాం’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.






