బంగారు కొండ ‘భారత్’..

దేశంలో బంగారం నిల్వలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏటా భారీగా పసిడిని కొనుగోలుచేస్తోంది ఆర్బీఐ. కొంత ఆర్బీఐ దగ్గర ఉంటున్నప్పటికీ.. మరికొంత బంగారాన్ని మాత్రం విదేశాల్లోని బ్యాంకుల్లో దాస్తోంది. వీటికి గానూ నిర్వహణ చార్జీలు చెల్లిస్తోంది.. దేశంలో బంగారం నిల్వలు పెరుగుతుండడం.. మన దేశం ఆర్థిక పరిపుష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు. అంటే ఒకనాడు అగ్రదేశాలకు బంగారం తాకట్టు పెట్టే స్థాయి నుంచి ఇప్పుడు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసేస్థాయికి చేరింది ఆధునిక భారత్.
1991 తర్వాత ఈ స్ఖాయిలో..
అయితే విదేశాల్లోని నిల్వలు కూడా పెరిగిపోతుండడంతో…ఇంగ్లాండ్ నుంచి భారీఎత్తున బంగారం నిల్వలను ఆర్‌బీఐ భారత్ కు తరలించింది. దాదాపు 100 టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్దఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సివచ్చింది.
రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్ ఇంతమొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది. దేశీయంగా ముంబయి మింట్ రోడ్డు సహా నాగ్‌పుర్‌లోని పాత కార్యాలయాల్లో ఆర్‌బీఐ పుత్తడిని నిల్వ చేస్తుంటుంది. కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకు పెద్దఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొంత మొత్తాన్ని భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.
చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. అదే బాటలో భారత్ సైతం అక్కడి డిపాజిటరీల్లో పెద్దఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది. 2024 మార్చి ముగిసేనాటికి ఆర్‌బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. ఇటీవల కొన్నేళ్లుగా వరుసగా కొనుగోలు చేస్తూ వచ్చిన కేంద్ర బ్యాంకు గత ఏడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది. ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెరిగింది. జనవరి- ఏప్రిల్ వ్యవధిలోనే 2023 మొత్తం కంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారం కొనుగోలు చేయడం గమనార్హం. ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజా తరలింపుతో ఆర్‌బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి. ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెల్లిస్తూ వచ్చిన రుసుము ఇకపై చెల్లించనక్కరలేదు.