పూరీ జగన్నాథుని రహస్య భాండాగారంలో ఏముంది..?

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌రూంకు తరలించినట్లు తెలిపారు భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడురథ్.ఇదంతా వీడియోగ్రఫీ సైతం చేయించామన్నారు.ఈనెల 18న రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తాం. అనంతరం ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగిస్తాం. పనులు పూర్తయ్యాక సంపదనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతామ’ని వెల్లడించారు. రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ఆలయ పాలకమండలి ప్రకటించింది.
1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు స్థానికులు.పూరీ రాజు కపిలేంద్రదేవ్ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చరిత్రలో ఉంది. తర్వాత పురుషోత్తందేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరింది. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపర్చడానికి రహస్య గది నిర్మించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయి. ఈ సంపద వెలకట్టలేనిది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలున్నాయి’ అని వివరించారు.
ముస్లిం దాడుల నుంచి రక్షణకు..
ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి, వాటిలో దాచినట్లు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేశ్‌చంద్ర దాస్ పేర్కొన్నారు. ‘రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారు. తర్వాత అతని ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా, వాటిని ఎవరూ కనుగొనలేకపోయార’ని దాస్ వివరించారు.