Modi-Trump: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..?
టారిఫ్ లు, బెదిరింపులతో భారత్ తో దిగజారిన సంబంధాలను తిరిగి యదాతథ స్థితికి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందా..? ఇందులో భాగంగానే మోడీ తనకు మంచి స్నేహితుడని ట్రంప్ పదేపదే చెబుతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే, అదే అనిపిస్తోంది. లేటెస్టుగా.. మోడీకి, ట్రంప్ ఫోన్ చేశారు.ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల పురోగతితో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు.
“అధ్యక్షుడు ట్రంప్‌తో చాలా ఆత్మీయంగా, ఫలవంతంగా సంభాషణ జరిగింది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయి” అని మోడీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం’లో పురోగతిని నేతలిద్దరూ సమీక్షించారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిలకడగా బలపడుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ఇండియా–యూఎస్ కాంపాక్ట్’ (COMPACT) అమలులో భాగంగా కీలకమైన సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత వంటి ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి, ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
భారత్‌తో వాణిజ్య చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పట్ల ట్రంప్‌కు గొప్ప గౌరవం ఉందని, ఇరువురు నేతలు తరచుగా మాట్లాడుకుంటారని ఆమె తెలిపారు. వాణిజ్య అంశంపై భారత ప్రతినిధులతో తమ బృందం ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా జరిగిన ఫోన్ సంభాషణ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.






