తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు..!

సంక్షోభ సమయాల్లో పెద్దన్నగా ఆదుకున్న భారత్‌పైనే కరుకైన విమర్శలు చేసింది మాల్దీవులు. అంతేకాదు.. భారత సైన్యం వెనక్కు వెళ్లిపోవాలంటూ ఆదేశాలిచ్చింది. ఆర్థికంగా ఆదుకుంటున్న భారతీయులపైనే అసహ్యకరంగా విమర్శలు గుప్పించారు ఆదేశ మంత్రులుగా ఉన్న వ్యక్తులు. తర్వాత వారిని తప్పించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు ఇండియా వ్యతిరేక భావజాలాన్ని నరనరానా నింపుకున్న ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని నిజం చేస్తూ చైనా పంచన చేరింది మాల్దీవులు.
భారత్ నుంచి పర్యాటకులు తగ్గడంతో..వారిస్థానాన్ని భర్తీ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని చైనాను అర్థించారు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు. కానీ చైనా మాత్రం.. తనకు ఎంతవరకూ లాభమన్న అంశాన్ని బేరీజు వేసుకుని ప్రవర్తిస్తోంది. ఈ పరిణామం మాల్దీవులను మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఇక మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సైతం చైనా అండ చూసుకొని అడ్డగోలుగా వ్యవహరించారు. ఇండియా అవుట్ అనే ప్రచారాన్ని గణనీయంగా చేపట్టారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇందుకు మే 10 వరకు గడువు విధించారు. అంతేకాదు చైనాలో పర్యటించి భారతదేశానికి వ్యతిరేకంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇది అక్కడి ప్రభుత్వ మనగడపై తీవ్ర ప్రభావం చూపించింది.
విపక్ష పార్టీల నాయకులు ముయిజ్జు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. ఒకానొక దశలో ఆ దేశ పార్లమెంట్లో జరిగిన సమావేశంలో విపక్ష పార్టీల నాయకులు ముయిజ్జు పార్టీ నాయకులపై దాడులు కూడా చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందని.. దీనిని తట్టుకోవాలంటే బెయిల్ అవుట్ రుణాన్ని కోరుతూ ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించారు..
ముయిజ్జు అధ్యక్షుడు కాకముందు భారత్ మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ దేశం కోసం భారత ప్రభుత్వం డబ్బు వెచ్చించేది. అయితే ఇటీవలి బడ్జెట్లో మాల్దీవులకు కేటాయించే సాయం విషయంలో భారత ప్రభుత్వం కోత విధించింది.. దీంతోపాటు మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులు పూర్తిగా తగ్గిపోవడం మాల్దీవుల ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో ఆర్థికపరంగా ఆ దేశం తీవ్ర అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. హోటళ్ళకు గిరాకీ లేకపోవడం, విమానయాన సంస్థలకు టికెట్లు బుక్ కాకపోవడం వంటి పరిణామాలు ఆ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
చైనా కూడా మాల్దీవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం.. ముయిజ్జు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. వాస్తవానికి చైనా అండ చూసుకొనే ఆయన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలుపెట్టారు.. అయినప్పటికీ చైనా ప్రభుత్వం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జీని విశ్వసించడం లేదు. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక పతనం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించిన ముయిజ్జి బెయిల్ అవుట్ రుణాన్ని కోరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.