నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, తాజా మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు పాల్గొన్నారు.
సీజేఐగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది.ఆయన స్థానంలో కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. 2025 మే 13వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు. సంజీవ్ ఖన్నా ఎన్నికల బాండ్లు, అధికరణం 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు.
ఏ హైకోర్టుకైనా ప్రధాన న్యాయమూర్తి కాకముందే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన అతికొద్ది మంది న్యాయమూర్తులలో ఖన్నా ఒకరు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ట్యాక్సేషన్, ఆర్బిట్రేషన్, కమర్షియల్, కంపెనీ లా కేసులు వాదించారు. 2005 జూన్ 25న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతేకాకుండా.. ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, క్రిమినల్ కేసుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా.. పలు విభాగాల్లో కీలక సేవలను అందించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా తండ్రి దేవరాజ్ ఖన్నా.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, పెదనాన్న హెచ్.ఆర్.ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.