Trump:పెద్దన్న బెదిరిస్తోంది.. ఇరాన్ తగ్గనంటోంది..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఏమాటన్నా ప్రపంచదేశాలు సై అంటున్నాయి. కానీ.. ఒక్క ఇరాన్ (Iran) మాత్రం నై అంటోంది. మాపై కన్నెర్ర చేస్తానంటే సహించేది లేదని సవాల్ చేస్తోంది. అణుఒప్పందం కుదుర్చుకోకుంటే దాడులు చేస్తామని ట్రంప్ బెదిరిస్తుంటే.. ఏం మాదగ్గర క్షిపణులు లేవా అని బెదురులేకుండా చెబుతోంది. ప్రస్తుత పరిణామాలు.. ప్రపంచదేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచదేశాలను .. మరీ ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలను వణికిస్తోంది.
ఓవైపు తాను చెప్పిందే జరగాలనుకునే ట్రంప్.. మరోవైపు నియంతకు అసలైన నిదర్శనం ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ.. ఎవ్వరూ తగ్గేవారు కాదు.. దీంతో ఈ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడకు పోతుందో అన్న భయం అందరిలోనూ ఉంది. మేం పరోక్ష చర్చలకు సిద్ధమేనని ఇరాన్ తేల్చిచెబుతోంది.ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్ప్యాడ్లపై సిద్ధంగా పెట్టినట్లు టెహ్రాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలున్నట్లు తెలిపింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు సదరు కథనం పేర్కొంది.
అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్యం ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు. దీనిపై ట్రంప్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ టెహ్రాన్‌పై బెదిరింపులకు దిగారు. ‘‘ఒకవేళ అణుఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరోవిడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయితే, ఇరాన్‌తో పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా? లేదా అనేదానిపై మాత్రం ట్రంప్ స్పష్టతనివ్వలేదు.
ట్రంప్ తొలి హయాంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణుఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎన్నోఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈక్రమంలోనే మరోసారి అణుఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు.






