నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఢీ అంటే ఢీ అంటున్న ఎన్డీఏ, ఇండియా కూటములు..

ఆ నాలుగు రాష్ట్రాలు.. ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి.. తమకు తిరుగులేదని నిరూపించాలని ప్రధాని మోడీ అండ్ కో భావిస్తున్నారు. మరోవైపు.. ఈ నాలుగు రాష్ట్రాల్లో తమ కూటమి విజయం సాధిస్తే.. మోడీ, బీజేపీ పని అయిపోయిందన్న భావనను ప్రజల్లో కలగజేయాలన్నది కాంగ్రెస్ భావనగా కనిపిస్తోంది. దీంతో ఇరు కూటములు. తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి, గెలవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇంతకూ ఏ కూటమి గెలిచే అవకాశముంది..? ఏయే రాష్ట్రాల్లో ఎవరికి అనుకూలతలున్నాయి. ఎలా ముందుకెళ్తున్నారు.
కీలకమైన రాష్ట్రం మహారాష్ట్ర…
మరాఠా పార్టీలు.. రాజకీయాల్లో ఆరితేరాయి. ఆది నుంచి ఇక్కడ ఆపార్టీలదే ఆధిపత్యం. వారు ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. బాలాసాహెబ్, శరద్ పవార్ లాంటి కాకలు తీరిన నేతలు… తమ చెప్పుచేతల్లో దశాబ్దాల పాటు మరాఠా పాలిటిక్స్ నడిపారు. అయితే నెమ్మదిగా వారి శకం ముగుస్తూ వచ్చింది. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ఓ ప్రకటన జారీ చేశారు శరద్ పవార్. మరి ఇలాంటి తరుణంలో అక్కడ జరగనున్న మరాఠా ఎన్నికలు.. ఎవరిని గెలిపిస్తాయి.. ఎవరిని ఓడిస్తాయి. మొన్నటి దఫా ఎన్నికల తర్వాత మరాఠా పార్టీలు కకా వికలమయ్యాయి.
ముఖ్యంగా మోడీ, షా చాణక్యం ముందు విలవిలలాడాయి. తొలుత శివసేనను చీల్చి, ఏక్ నాథ్ షిండే వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఉద్ధవ్ వర్గం ఒక్కసారిగా బలహీనపడింది. దీనికి తోడు ఉద్ధవ్ కు.. బాలాసాహెబ్ కు ఉన్నట్లుగా చరిష్మా లేకపోవడం.. ఆ వర్గానికి మైనస్ గా మారింది. ఇక ఎన్సీపీని చీల్చి.. అజిత్ పవార్, బీజేపీ సర్కార్ లో చేరిపోయారు. డిప్యూటీ సీఎంగా పదవి అధిష్టించారు. అంటే ఎన్సీపీ కూడా చీలి బలహీనపడింది. దీంతో రెండు మరాఠాపార్టీలు చీలికలు, పేలికలుగా మారాయి. అయితే ప్రజల్లో బీజేపీ కూటమికి సానుకూలత కనిపించడం లేదు. ముఖ్యంగా తాము నమ్మి అధికారమిచ్చిన పార్టీలను బీజేపీ చీల్చి, రాజకీయాలు చేసిందన్న అభిప్రాయం.. మరాఠా ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొన్నటి ఉపఎన్నికల ఫలితాలు కూడా దాన్నే ప్రతిబింబించాయి. దీంతో బీజేపీలో సైతం.. అంతర్మథనం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీన్ని ఎలా అధిగమించాలన్న అంశంపై.. సమాలోచనలు జరుపుతున్నారు కమలనాథులు.
మరోవైపు.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడి వాగ్దాలను గుప్పిస్తున్నాయి. తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఎన్డీఏ, షిండే సర్కార్ కు గట్టి షాకివ్వాలని.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) ప్రయత్నిస్తోంది.అటు ఎంవీఏ కూటమి ఇటు మహాయతి (బీజేపీ, షిండే సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) రెండూ మహిళలు, రైతులు, వృద్దులను ఆకట్టుకునేందుకు పోటీలు పడుతూ పలు పథకాలను ప్రకటించాయి. మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే కులగణన ప్రారంభిస్తామని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) హామీ ఇచ్చింది.. 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో రెండు ఐచ్చిక సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ‘మహారాష్ట్రనామ’ పేరిట ఎంవీఏ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేశారు.
మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యేకంగా సాధికారత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిశు సంక్షేమం కోసం డెడికేటెడ్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన మహిళలకు రూ.500 చొప్పున ధరతో ప్రతిఏటా ఆరు వంట గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పలు సామాజికవర్గాల స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవడానికే కులగణన తప్ప సమాజాన్ని కులాలవారీగా విభజించడానికి కాదని ఖర్గే చెప్పారు. ఆ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అమలు చేయాల్సిన విధానాల రూపకల్పనకు ఆ డేటా తోడ్పడుతుందన్నారు. కులగణనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాదని, అర్బన్ నక్సలైట్లకు ప్రతీక అని మోడీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేని మోడీని మళ్లీ ప్రాథమిక పాఠశాలలో చేర్చాలని ఎద్దేవా చేశారు. 2017 జూలై 16న ఇలాంటి రాజ్యాంగ ప్రతినే అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మోడీ అందజేశారన్నారు.
కొత్తగా ఉచిత బస్సు ప్రయాణం
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్‌ల కూటమి ఎంవిఎ ‘లోక్సేవేచి పంచసూత్రి’ కింద పలు వాగ్దానాలను ప్రకటించింది. ఇందులో నెలకు మూడు వేల రూపాయల డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు చెల్లించే రైతులకు అదనంగా రూ.50 వేలు మాఫీ చేస్తామని ఎంవీఏ కూటమి హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల వరకూ ప్రయోజనం చేకూరుస్తామని, పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు.
పథకాల మొత్తాల పెంపు
ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గత కొంతకాలంగా నగదు పథకాలను అందిస్తోంది. ఒకప్పుడు ఉచిత పథకాలను విమర్శిస్తూ, దేశ అభివృద్ధికి ఇది ప్రమాదకరమని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు బీజేపీ తరపున పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన లడ్కీ బహిన్ పథకపు మొత్తాన్ని 1,500 నుండి రూ.2,100కి పెంచింది. ఈ పథకం కింద మహిళలు, వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే విద్యార్థులకు నెలకు రూ. 10,000 సహాయం, రైతులకు రూ.15,000 ఆర్థిక సహాన్ని ప్రకటించింది. గతంలో ఇది రూ.12,000గా ఉంది.
మహిళలు.. లఖ్‌పతి దీదీలు
మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని అధికార ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. 2027 నాటికి 50 లక్షల మంది మహిళలను 'లఖ్‌పతి దీదీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొంది. దీంతో పాటు రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.1000 కోట్లు అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక మహావికాస్ అఘాడి (ఎంవీఏ) విషయానికొస్తే మహిళల కోసం మహాలక్ష్మి యోజనను ప్రారంభిస్తామని, దీని కింద మహిళలకు నెలకు రూ. 3000 ఆర్థిక సహాయం అందజేస్తామని హామీనిచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీనిచ్చింది.
రైతులకు రుణాలు.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
మహారాష్ట్రలోని రైతులకు రూ.15 వేల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయోత్పత్తులపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై 20 శాతం రాయితీ కల్పిస్తామని అధికార కూటమి హామీ ఇచ్చింది. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని పేర్కొంది. ఇదే విషయంలో సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రతిపక్ష కూటమి హామీ ఇచ్చింది. 10 లక్షల మంది విద్యార్థులకు రూ.10,000 స్కాలర్‌షిప్ ఇస్తామని ఎన్డీఏ హామీనిచ్చింది. అలాగే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక ఎంవీఏ విషయానికొస్తే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.4000 స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది.
మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే కఠినమైన నిబంధనలతో మత మార్పిడి నిరోధక చట్టం తెస్తామని బీజేపీ ప్రకటించింది. అల్పాదాయ కుటుంబాలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దుతామని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం–2024’ పేరిట బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో 25 హామీలను పొందుపర్చారు.
అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలా: అమిత్ షా
మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికైనా దిగజారడం ఆ కూటమికి అలవాటేనన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉలేమా కౌన్సిల్ చేసిన డిమాండ్‌కు పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే అంగీకరించారన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎంవీఏ నేతలు అధికార దాహంతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు.
అయితే అధికార కూటమిలో ముగ్గురు సీఎం అభ్యర్థులుండడం ..చిన్నపాటి గందరగోళానికి దారి తీస్తోంది. తమకు అంటే తమకు సీఎం కావాలని ముగ్గురు భావిస్తున్నారు. ఒకరు ప్రస్తుత సీఎం షిండే, మరొకరు ఎన్సీపీ చీలికవర్గం నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. మూడో నేత బీజేపీ మాజీ సీఎం ఫడ్నవీస్.. వీరందరినీ కలిపి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కూటమి ప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి.
ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్‌లో హోరాహోరీ
13న తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్‌లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్‌లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి.
2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు.
ఇండియా కూటమి తరఫున హేమంత్‌కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్‌యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బంధువులు, వారసుల జోరు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు.
వలసదారులే ప్రధానాంశం!
నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్‌ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
చొరబాట్లే కీలకం…
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బంగ్లాదేశ్, రోహింగ్యాల చొరబాట్ల అంశాన్ని కాషాయ పార్టీ (BJP) ప్రధానంగా ఎంచుకుంది. సంతాల్ పరగణాలు, కొల్హాన్ ప్రాంతాల్లో ఈ సమస్య భారీగా ఉందని.. రాష్ట్రాన్ని ధర్మసత్రంగా మారుస్తున్నారని మండిపడింది. ఓట్ల కోసమే అక్రమ చొరబాటుదారులకు కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన జేఎంఎం ప్రభుత్వం ఆశ్రయమిస్తోందని ఆరోపించింది.
ఝార్ఖండ్‌లో హోరాహోరీ..ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ
అయితే, భాజపా విమర్శలను తిప్పికొట్టిన జేఎంఎం.. ఈ అంశాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని సీఎం హేమంత్ ఆరోపించారు.
ప్రజాకర్షక పథకాలు..
రాష్ట్రంలో ప్రజాకర్షక పథకాలపైనా ఇరు పక్షాలు అనేక హామీలు కురిపించాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టగా.. బీజేపీ కూడా అర్హులైన మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా జేఎంఎం మరో ముందడుగు వేసి.. ఈ మొత్తాన్ని రూ.2500కు పెంచుతామని హామీ ఇవ్వడం గమనార్హం.
ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది: ప్రధాని మోదీ
ఎల్‌పీజీ సిలిండర్ రూ.500లకే అందించడంతోపాటు ఏడాదికి రెండు ఉచితంగా ఇవ్వడం, నిరుద్యోగులకు రెండేళ్ల పాటు నెలకు రూ.2వేల చొప్పున అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు, రెండున్నర లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి హామీలూ కురిపించింది.
ప్రభుత్వంలో అవినీతి..
హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై అవినీతి కూడా ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా నిలిచింది. ఓ భూ ఒప్పందానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్ అరెస్టు అంశం ఎన్నికల ప్రచారంగా మారింది. జేఎంఎం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపించగా.. ఆదివాసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా కాషాయ పార్టీ రాజకీయాలు చేస్తోందని అధికార పార్టీ మండిపడింది.
చంపాయీ తిరుగుబాటు..
జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే.. చంపాయీ నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ముందస్తుగా అంచనా వేశారు. అందుకు తగినట్లుగానే పార్టీని వీడిన ఆయన.. బీజేపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయీకి ఉన్న ప్రజాదరణ వల్ల ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయని, అది జేఎంఎ-కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
దేశ రాజకీయాల్లో కీలకమైన ఢిల్లీని మరోసారి దక్కించుకోవాలని ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆప్ అధ్యక్షుడు , మాజీ సీఎం కేజ్రీవాల్.. మరోసారి తనదైన రీతిలో వ్యూహాలకు పదును పెట్టారు. బీజేపీలోని అపరచాణక్యులైన మోడీ, అమిత్ షాల వ్యూహాలను తిప్పికొడుతూ వరుసగా గెలుస్తూ వచ్చారు కేజ్రీవాల్. ఈసారి ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు కావడం, దీనికి తోడు ఇతర మంత్రులు సైతం అరెస్ట్ కావడంతో….ఆప్ అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
అయితే.. కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి అతిషిని.. సీఎంను చేశారు. తమ పార్టీకి వీరవిధేయురాలు అయిన అతిషీని.. సీఎంను చేసి, తాను ఎన్నికల ప్రచార రథాన్ని ముందుకు ఉరికించారు. ఎన్నికల్లో గెల్చిన తర్వాతే.. తిరిగి సీఎంగా పదవిని చేపడతామని ఇప్పటికే ప్రకటించారు కూడా. అంతేకాదు.. తమ పార్టీ నేతలను అన్యాయంగా బీజేపీ అరెస్టులు చేసి, పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు.
అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఓడిస్తూ వచ్చిన కమలనాథులు… హస్తినను మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. దీనికి కారణం.. ఓవైపు కేజ్రీవాల్ వ్యూహాలు… మరోవైపు అభివృద్ధి మంత్రం. దేశంలోని స్కూల్స్ అన్నింటికి రోల్ మోడల్ లా ప్రభుత్వ స్కూల్స్ ను ఆప్ సర్కార్ తీర్చిదిద్దింది. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరించింది. విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తోంది. ఈ పరిణామాలకు తోడు హస్తినలోని ముస్లిం సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ.. ఆ సామాజిక వర్గం ఓట్లను సైతం తన గుప్పిట్లోకి తీసుకోవడంలో సక్సెసైంది. అందుకే బీజేపీ ఎంతగా ప్రయత్నిస్తున్నా..ఆప్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతోంది.
ఇక ఈరాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వరుసగా దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయింది. ఆపార్టీ నేతలు, కార్యకర్తల్లో సైతం.. తిరిగి పార్టీ అదికారంలోకి వస్తుందన్న నమ్మకం సడలింది. ఫలితంగా ఢిల్లీ ఇప్పుడు కాంగ్రెస్ కు అందని ద్రాక్షలా మారింది.
బిహార్ సంకుల సమరం…
బిహార్ లో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి మధ్య సంకులసమరం జరగనుంది. ఓవైపు అపరచాణక్యుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ.. మ్యాజిక్ ఫిగర్ ను సాధించేదిశగా అడుగులేస్తోంది. నితీష్ కుమార్ కు .. నిమ్నవర్గాల్లో ఉన్న ఆదరణపై.. ఎన్డీఏ గంపెడాశలు పెట్టుకుంది. బిహార్ లో గతపాలనకు భిన్నంగా నితీష్ పాలన ఉండడం.. కాస్త అభివృద్ధి కనిపిస్తుండడంతో, ప్రజల్లో ఎన్డీఏ కూటమిపై ఆదరణ కనిపిస్తోంది.
అయితే నితీష్ కుమార్.. ఎన్నికల ఎత్తుగడలు మాత్రం.. కాస్త వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా కూటమి మారి అన్నట్లుగా అయితే ఎన్డీఏ, కాదంటే ఇండియా కూటమి అన్నట్లుగా నితీష్ రాజకీయాలు నడుపుతున్నారు. తమతోనే నితీష్ ఉన్నప్పటికీ.. మోడీ అండ్ కో కు ఆయన ఎప్పడివరకూ తమతో ఉంటారన్నది అనుమానమే. ఇటు ఎన్డీఏతో అంటకాగుతూనే.. మరోవైపు.. ఇండియా కూటమి నేతలతోనూ నితీష్ సత్సంబంధాలను నెరపుతున్నారు. అంతెందుకు ప్రత్యర్థి లాలూకుమారుడు.. తేజస్వీయాదవ్ తో నూ నితీష్ కు మంచి సంబంధాలే ఉన్నాయంటారు రాజకీయ విశ్లేషకులు.
ఇక ఇండియా కూటమిలో పెద్దపార్టీ ఆర్జేడీ. తేజస్వీ ప్రతాప్ యాదవ్ నేతృత్వంలో బలంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగానే అవతరించింది. జేడీయూతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసింది. కానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లుగా ఆర్జేడీకి షాకిస్తూ.. జేడీయూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంత జరిగినా తేజస్వీ యాదవ్.. నితీష్ పై పరోక్ష విమర్శలు చేశారే కానీ.. నేరుగా ఘాటుగా విమర్శలు గుప్పించలేదు . ఎందుకంటే.. ఎప్పుడు ఎవరి అవసరం, ఏపార్టీకి వస్తుందో ఎవరికి తెలుసు.
ఇక కాంగ్రెస్.. బిహార్ లో ఓ మిత్రపక్షం మాత్రమే. అక్కడ తేజస్వీ కేటాయింపులకు అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే తేజస్వీయాదవ్ మాత్రం.. మిగిలిన పార్టీలకు సైతం తగిన గౌరవమిస్తూ.. సీట్ల కేటాయింపులోనూ ఉదారత కనబరుస్తున్నారు. ఆర్జేడీకి యాదవ్, ముస్లిం వర్గం ఓటుబ్యాంకు అండగా నిలుస్తోంది.ఇక జేడీయూకు కుర్మి, ఇతర వెనకబడిన వర్గాలు ఆదరిస్తున్నాయి. బీజేపీ .. హిందూ ఓటుబ్యాంక్ పైనే ఆధారపడి ఉంది. సోషల్ ఇంజినీరింగ్ సాయంతో ఈసారి .. బిహార్ లో అధికారాన్ని సాధిస్తామంటోంది ఇండియా కూటమి. ఆ ప్రశ్నే లేదు.. మళ్లీ తమదే అధికారమంటున్నారు నితీష్ కుమార్.
మొత్తం 243 స్థానాలకు గానూ ఎన్డీఏ 129 స్థానాలను సాధించింది. ఇందులో బీజేపీ అత్యధికంగా 80 స్థానాల్లో గెలుపొందగా.. జేడీయూ 44 స్థానాలు, ఇతర చిన్నపార్టీలు 5 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే 109 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్జేడీ అత్యధికంగా 77 స్థానాలు, కాంగ్రెస్ 17, సీపీఐఎంఎల్ 11, సీపీఐ 2, సీపీఎం 2 స్థానాలు సాధించాయి.