ఆఫ్గన్ లో వరద భీభత్సం..
ఆఫ్గానిస్థాన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు వరదనీరు పోటెత్తింది. బఘ్లాన్ ప్రావిన్స్‌లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ విపత్తుతో పలు గృహాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. దాంతో భారీ ఆస్తినష్టం సంభవించింది.
ఈ వర్షాలకు ఉత్తర అఫ్గానిస్థాన్ తీవ్రంగా ప్రభావితమైందని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.. శుక్రవారం రాత్రి వరకు 62 మంది మృతి చెందారని తెలిపారు. మరణాలు వందల సంఖ్యలోనే ఉండొచ్చని ప్రాథమికంగా వెల్లడించారు. ‘‘బదాక్షన్, బఘ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ విధ్వంసం భారీ ఆస్తినష్టాన్ని మిగిల్చింది’’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. అఫ్గాన్ వాతావరణ పరిస్థితులు కూడా ఈ వరదలకు దోహదం చేస్తున్నాయి. అక్కడి వాతావరణం కారణంగా ఆఫ్గన్ నేలలకు నీటిని పీల్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కొన్నేళ్లపాటు అంతర్యుద్ధ పరిస్థితుల్లో మగ్గిన ఆ దేశానికి.. ప్రకృతి విపత్తుల వల్ల ఎదురయ్యే పర్యవసానాలను తట్టుకునే సన్నద్ధత చాలా తక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలో అఫ్గాన్‌లో వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. గత నెలలోనూ వరదలు సంభవించి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.






