తగ్గేదే లే..
ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎలాంటి విచారణ జరిగినా.. తాను మాత్రం ఎన్నికల బరిలో నిలిచి తీరతానంటున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. అధ్యక్ష ఎన్నికల్లో తన విజయావకాశాలకు గండి కొట్టేందుకే విచారణ చేపట్టారని. శిక్షపడినా పోటీ చేసి తీరతానంటున్నారు. అంతే కాదు.. తాను రిపబ్లికన్ అయినందువల్లే తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని మరోసారి ట్రంప్ పునరుద్ఘాటించారు.
పదవి నుంచి దిగిపోయినప్పుడు పెద్దఎత్తున అధికారిక పత్రాలను తన ఇంటికి ట్రంప్ తీసుకుపోయినట్లు అభియోగాలున్నాయి. దీనిపై విచారణను సైతం ట్రంప్ తప్పుపట్టారు.మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఒకదాని తర్వాత ఒకటిగా విచారణలు చేపడుతున్నారు. అమెరికా ప్రజల అభీష్టాన్ని అణచివేయడం వారి ఉద్దేశం. ఇదంతా నా వెంట కాదు.. ప్రజల వెంట పడడమే. నన్ను వేధింపులకు గురిచేసినా ఎప్పటికీ వదిలేది లేదు అని స్పష్టం చేశారు.
ఇక ట్రంప్ పాలనలో అనుసరించిన విధానాలతో ఆయనకు ఓబలమైన వర్గం ఏర్పడింది. వారు ట్రంప్ .. దేశానికి రక్షకుడిగా భావిస్తున్నారు. అది ఎంతవరకూ వెళ్లిందంటే రెండేళ్ల క్రితం ట్రంప్ కోసం.. క్యాపిటల్ హిల్ పై దాడి చేసేస్థాయికి చేరింది. ఈ దాడిలో కొందరిపాత్రను గుర్తించిన అమెరికన్ అధికారులు.. వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఈ ఘటనలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ట్రంప్ సంఘీభావం తెలిపారు. వారు పాటిన పాటకు ఆయన తన స్వరాన్ని అందించారు. జస్టిస్ ఫర్ ఆల్ అన్న టైటిల్‌తో సాగిన సాంగ్‌లో ట్రంప్ కూడా కొన్ని లైన్లు పాడారు. మరోవైపు..ఖైదీలతో ట్రంప్ గొంతు కలిపిన పాటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులపై కూడా పోలీసులు న్యాయపరమైన చర్యలకు దిగనున్నారు.
జార్జియా సహా పలు రాష్ట్రాల్లో ట్రంప్ నకు గట్టి మద్దతుదారులున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ట్రంప్ గెలవాలన్న కసి వారిలో కనిపిస్తోంది.ఇదే ఇప్పుడు అమెరికన్లను భయపెడుతోంది. ట్రంప్ .. ఓవర్గానికి ప్రతినిధిలా వ్యవహరిస్తుండడంతో.. అతను మరోసారి గెలిస్తే, అమెరికాలో ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని .. ఆదేశంలోని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రంప్ నకు ఆయన ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మైక్ పెన్స్ .. ప్రత్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఇది ట్రంప్ వర్గం జీర్ణించుకోలేని ఘటనగా చెప్పొచ్చు.
అయితే ప్రస్తుత అధ్యక్షుడు బైడన్ వార్థక్యంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా 2024లో అమెరికన్ అధ్యక్షుడిగా పోటీపడుతున్నారు. ఇప్పటికే బైడన్ ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని అంశాల్లో బైడన్ సర్కార్ సరిగ్గా వ్యవహరించలేకపోయారన్న భావన అమెరికన్లలో ఉంది. ముఖ్యంగా చైనా విషయంలో సరిగ్గా వ్యవహరించలేకపోతున్నారని.. సగటు అమెరికన్ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో బైడన్ పై ట్రంప్ పోటీచేసే పరిస్థితి వస్తే.. గెలుపు ట్రంప్ దే అని అతని అనుచరవర్గం బలంగా భావిస్తోంది.






