CHINA: చైనాలో లవ్ పాఠాలు..
జనాభా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా అన్నిప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్నవృద్ధుల జనాభా,తగ్గుతున్నజననాలు.. డ్రాగన్ కంట్రీని ఆందోళనకుగురిచేస్తున్నాయి. దీంతో పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి..దేశాన్ని కాపాడండి అంటూ ప్రచారం చేస్తోంది. అయితే దీనికి ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో.. ఇక ఇలా కాదని ఏకంగా కాలేజీలు. వర్సిటీల్లో ప్రేమపాఠాలు మొదలెట్టేసింది. చైనాలో సంతానోత్పత్తి రోజురోజుకు తగ్గిపోతుంది.
దేశ జనాభా భారీగా తగ్గిపోతుందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు జనాభాలో చైనా అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి దిగజారిపోయింది. 2023లో వరుసగా రెండోసారి చైనా జనాభా నిష్పత్తి దారుణంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సంతానోత్పత్తి పెంచేందుకు అన్ని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో వివాహం, కుటుంబం, సంతానోత్పత్తికి సంబంధించిన పాఠాలను విద్యార్థులకు నేర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. జనాభా రేటును పెంచేందుకు యువకులకు ప్రేమ విద్యను అందించాలని సూచించింది. విద్యాపరమైన ఒత్తిడి కారణంగా 57 శాతం మంది విద్యార్థులు వివాహ సంబంధాలపై ఆసక్తి చూపడం లేదని ఓ సర్వేలో తేలింది. చాలా మంది పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదని నివేదికలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో వివాహ సంబంధాలపై అవగాహన, భవిష్యత్లో సంతానోత్పత్తిని ప్రోత్సహించడానికి కాళాశాలల్లోనే పునాది వేయాలని యూనివర్సిటీలకు చైనా సూచించింది. చదువులతో పాటు శృంగారం గురించి అవగాహన కల్పించాలని పేర్కొంది.ప్రేమ, వివాహం గురించి శాస్త్రీయంగా అవగాహన లేకపోవడంతో యువత వివాహానికి దూరమైపోతున్నారని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే 80 దశకంలో అమలు చేసిన వన్ చైల్డ్ దుష్ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని చెబుతున్నారు చైనా మానవ వనరులనిపుణులు.






