Davos: దావోస్లో చంద్రబాబు – రేవంత్…! సత్తా చాటేదెవరు..?
విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగితేనే రాష్ట్రాల్లో అభివృద్ధి పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాలు (Telugu States) ఈ దిశగా ఎప్పుడూ ముందుంటాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM Chandrababu) ఉన్నప్పుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (World Economic Forum) సదస్సులకు వెళ్లడం ప్రారంభించారు. అక్కడ దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించేవారు. వాళ్లను కన్విన్స్ చేసి రాష్ట్రానికి రప్పించే వారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండూ తమదైన ప్రయత్నాలు చేసుకుంటూ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్రం విడిపోయి పదేళ్లయింది. ఏపీలో మొదటి ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అప్పట్లో విరివిగా దావోస్ (Davos) వెళ్లి పెట్టుబడులను ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత ఐదేళ్లు జగన్ పరిపాలించారు. ఆ సమయంలో ఆయన దావోస్ వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం ఒకసారి మాత్రమే ఆయన దావోస్ వెళ్లారు. ఇక తెలంగాణలో (Telangana) పదేళ్లపాటు బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉంది. అప్పుడు కేసీఆర్ (KCR) కాకుండా ఆయన తరపున కేటీఆర్ (KTR) పలుమార్లు దావోస్ సమ్మిట్ కు వెళ్లి పెట్టుబడులు తెచ్చుకోగలిగారు. మొదటి ఐదేళ్లు చంద్రబాబు వల్ల ఏపీకి ఎక్కువ పెట్టుబడులు రాగా తర్వాతి ఐదేళ్లలో కేటీఆర్ ఎక్కువ ఇన్వెస్ట్ మెంట్లను రాబట్టుకోగలిగారు.
అయితే ఇప్పుడు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ దావోస్ వెళ్లారు. దీంతో ఈసారి ఎవరు ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తారనేది ఆసక్తి రేపుతోంది. పెట్టుబడులు ఆకట్టుకోవడానికి తెలంగాణకు ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచస్థాయి హైదరాబాద్ (Hyderabad) నగరం తెలంగాణకు ఉంది. ప్రపంచంలోని పలు ప్రాంతాలను కలిపే ఎయిర్ కనెక్టివిటీ కూడా హైదరాబాద్ సొంతం. ముఖ్యంగా ఐటీ రంగంలో తెలంగాణ ప్రపంచపటంలో ఇప్పటికే తనదైన ముద్ర వేయగలిగింది. అయితే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనుభవ లేమి, పారిశ్రామిక వేత్తలతో పెద్దగా పరిచయాలు లేకపోవడం తెలంగాణకు మైనస్. వీటిని అధిగమించగలిగితే తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. ఆయనకు పలువురు పారిశ్రామిక వేత్తలతో పరిచయాలున్నాయి. చంద్రబాబును చూసి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. అయితే కేవలం వ్యక్తిని చూసి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనకూలతలను చూస్తారు. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. పలువురు పారిశ్రామిక వేత్తలు పెట్టాలనుకున్న పెట్టుబడులను క్యాన్సిల్ చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్లు జగన్ (YS Jagan) మళ్లీ రాకుండా చూడాలని కోరుతున్నట్టు సాక్షాత్తూ లోకేశ్ (Nara Lokesh) వెల్లడించారు. మరి ఆ భరోసాను ఏపీ ప్రతినిధులు పారిశ్రామిక వేత్తలకు ఇవ్వగలుగుతారా అనేది చూడాలి. వీటిని పక్కన పెడితే సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీకి కలిసొచ్చే అంశం. విస్తృతమైన పోర్టులు అందుబాటులో ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలు అడిగిన వాటిన్నింటినీ ఇచ్చి రెడ్ కార్పెట్ పరిచే ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవి ఏపీ అనుకూలతలు. అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం, హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీ లేకపోవడం ఏపీకి ప్రతికూలతలు.
తొలిసారి దావోస్ సదస్సుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ వెళ్లారు వీళ్లతో పాటు మన దేశం నుంచి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దావోస్ వెళ్లినవారిలో ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఎక్కువ పెట్టుబడులను ఆకట్టుకోగలుగుతారనేది వేచి చూడాలి.






