పాకిస్తాన్ – అమెరికా లవ్ స్టోరీ..! ఇంతలోనే ఎంత మార్పు..?
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని.. ఆ దేశం ప్రమాదకరం అని అమెరికా పలుమార్లు చెప్తూ వచ్చింది. అల్ ఖైదా వ్యవహారాలన్నింటికీ పాకిస్తానే కేంద్రబిందువని చెప్పింది. బిన్ లాడెన్ ను కూడా పాకిస్తాన్ కు తెలియకుండానే ఆదేశంలోనే మట్టుబెట్టింది. పాకిస్తాన్ పట్ల అమెరికా కఠినవైఖరి అవలంబిస్తూ వచ్చింది. ఉగ్రవాదులను ఏరివేస్తే తప్ప తమ వైఖరిలో మార్పు ఉండబోదని తేల్చి చెప్తూ వచ్చింది. ఇండియా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆధారాలు సమర్పించడంతో అమెరికా కూడా తీవ్రంగా స్పందించేది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది.
పాకిస్తాన్ పై అమెరికా వైఖరి ఇటీవలికాలంలో గందరగోళంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లను ఏరివేసేందుకు పాకిస్తాన్ సాయం తీసుకున్న అమెరికా ఆ దేశంతో సత్సంబంధాలనే కొనసాగిస్తూ వచ్చింది. దీంతో అమెరికా – పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడ్డాయని అందరూ భావించారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మూడ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ కు ఆగ్రహం తెప్పించాయి. ప్రపంచంలోని ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని.. ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని బైడెన్ అన్నారు. తమను ప్రమాదకర దేశంగా పరిగణించడంపై పాకిస్తాన్ మండిపడింది. ఆ దేశ రాయబారికి సమన్లు ఇచ్చేంత వరకూ వెళ్లింది..
అయితే ఇదంతా కేవలం రెండ్రోజులే.! 48 గంటల్లోనే అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఎఫ్-16 యుద్ధ విమానాల విడిభాగాలను, యంత్రాలను పాకిస్తాన్ కు ఇచ్చేందుకు అమెరికా ఒప్పుకుంది. దీంతో ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా నివ్వెరపోయింది. పాకిస్తాన్ ప్రమాదకరదేశం అని బైడెన్ ప్రకటించి 48 గంటలు కూడా గడవక ముందే పాకిస్తాన్ యుద్ధవిమానాలకు సాయం చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. బైడెన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రెండ్రోజుల్లోనే పాకిస్తాన్ సేఫ్ కంట్రీ అయిపోయిందా అని నిలదీస్తున్నారు.
బైడెన్ కామెంట్స్ చిచ్చురేపడంతో పాకిస్తాన్ ను మచ్చిక చేసుకునేందుకే అమెరికా సాయం చేయాలనే నిర్ణయం తీసుకుని ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాణిజ్యపరంగా అమెరికాకు పాకిస్తాన్ కీలక దేశం. అమెరికాకు చెందిన పలు వస్తువులను పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. అది అమెరికా ఆర్థిక రంగానికి ఎంతో దోహదపడుతోంది. అంతేకాక.. ఆసియాలో పాకిస్తాన్ ను వ్యూహత్మక స్థావరంగా చేసుకుంది అమెరికా. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది.






