Pawan Kalyan: జాతీయ భద్రతపై అప్రమత్తంగా ఉండండి – సీఎస్, డీజీపీకి పవన్ లేఖలు

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత దేశమంతటా భద్రతా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం (Vizianagaram)లో ఉగ్రవాదానికి సంబంధించి ఏర్పడిన పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు యువకులు ఐసిస్ ఆదేశాలతో బాంబులు తయారు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో, ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ముఖ్య కార్యదర్శి విజయానంద్ (Vijayanand), డీజీపీ హరీష్ గుప్తాకు (Harish Gupta) లేఖలు రాసి పలు సూచనలు చేశారు.
ఈ లేఖలలో భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాల పోలీసు విభాగాలు అప్రమత్తంగా ఉండాలనే సూచనలు ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలిపే వ్యక్తులు, స్లీపర్ సెల్స్, అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల కదలికలపై నిఘా పెంచాలని పవన్ సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఇలాంటి సంభవాలు అధికంగా జరగే అవకాశమున్నందున, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.
ఐసిస్ సంభందాలు ఉన్నట్టు విచారణలో తేలిన యువకుడి అరెస్టు విషయాన్ని పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్న తరుణంలో, రాష్ట్ర పోలీసు శాఖ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. గతంలో గుంటూరు (Guntur) ప్రాంతంలో జరిగిన ఎన్.ఐ.ఏ దాడులు, అలాగే రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో జరిగిన చర్యలను గుర్తు చేస్తూ, ఇప్పటికే ఉన్న సమాచారం ఆధారంగా లోతుగా దర్యాప్తు జరిపించాలని కోరారు.
రోహింగ్యాల (Rohingyas) ఉనికిపై కూడా పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంటూరు సహా పలు జిల్లాల్లో వారిలో కొందరికి ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నట్టు తెలిసిన నేపథ్యంలో, వారు ఇవి ఎలా పొందారు? వారికి సహకరిస్తున్నవారు ఎవరు? అన్న విషయాలపై సమగ్ర విచారణ అవసరమని సూచించారు. వీరి ఆచూకీ తెలుసుకొని, అవసరమైనచోట నిఘా పెంచాలని, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ భద్రత, ప్రజల రక్షణను అత్యంత ప్రాముఖ్యతతో తీసుకోవాలని పవన్ తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు నిత్యం సమాచారం సేకరించి, ప్రభుత్వం దృష్టికి తక్షణమే తీసుకురావాలని సూచించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రం కేంద్రంతో సమన్వయంగా పనిచేసే అవకాశం ఉందని, దేశ భద్రతకు రాష్ట్రం పూర్తి స్థాయిలో తోడ్పాటివ్వగలదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.