Bangladesh: బంగ్లాదేశ్ లోని భారతీయులకు అడ్వైజరీ.. హైకమిషన్ సూచనలు..!
సంక్షుభిత బంగ్లాదేశ్.. మరోసారి రణరంగంలా మారింది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణంతో ఆందోళనకారులు మళ్లీ వీధుల్లోకి (Bangladesh Protests) వచ్చారు. గురువారం రాత్రి నుంచి భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission in Bangladesh) అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
‘‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించండి’’ అని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు.
మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పందించింది. పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతోందని, బంగ్లాలో మైనార్టీలపై దాడుల గురించి తెలిసి విదేశాంగ శాఖ ఆందోళనతో ఉందని పేర్కొంది. ఆ దేశంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపైనా అనిశ్చితి నెలకొందని తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని పేర్కొంది.






