Sajeeb Wazed: బంగ్లాదేశ్ అతివాదులతో భారత్ కు డేంజర్ బెల్స్ – హసీనా కుమారుడు..
బంగ్లాదేశ్ లో తాజా సంక్షోభంపై మాజీ ప్రధాని షేక్ హసీనాకుమారుడు వాజెద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమదేశంలో రాజకీయ సంక్షోభం భారత్‌కు పెద్ద ముప్పు అని వ్యాఖ్యానించారు. యూనస్ మధ్యంతర సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమదేశంలో..ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొన్నాయని ఆరోపించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లా (Bangladesh)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా… ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే కుట్ర జరుగుతోందన్నారు. ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టాలనే ప్రయత్నాన్ని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం చేస్తోందన్నారు వాజెద్. ఈ మార్పు భారత భద్రతపై ప్రత్యక్షమైన ప్రభావం చూపనుందన్నారు. ‘బంగ్లాలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయి. ఉగ్రసంస్థ అల్‌ఖైదాకు చెందిన వ్యక్తులు అక్కడ చురుకుగా పనిచేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తయ్యిబా కమాండర్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ భారత్‌కు ముప్పే. ఇది వాస్తవం’ అని సాజిబ్ అన్నారు.
జమాతే ఇస్లామీ వంటి ఇతర ఇస్లామిక్ పార్టీలకు తాత్కాలిక ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆరోపించారు. అలాంటి శక్తుల ప్రభావంతో బంగ్లాలో అస్థిరత నెలకొంటుందన్నారు. ఇది సరిహద్దు దేశమైన భారత్‌కు కూడా ముప్పేనని హెచ్చరించారు. దేశంలోని సగం మంది ఓటర్లను తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆరోపించారు.
గతంలో ఇస్లామిక్ సంస్థలపై అవామీ లీగ్ పాలనలో విధించిన ఆంక్షలను యూనస్ ప్రభుత్వం సడలించిందన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న పాక్ వంటి దేశాలతో అంటకాగుతుందని ఆరోపించారు. అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడు భారత తూర్పు సరిహద్దులను ఉగ్రవాదుల నుంచి సురక్షితంగా ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక, బంగ్లాలో ప్రజాస్వామ్యం తిరిగి రావాలని, ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.






