తమిళనాట టీవీకే సంచలనం….విజయ్ వర్సెస్ ద్రవిడ పార్టీలు…

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పాటు తన పార్టీ సిద్ధాంతాలు, వచ్చే ఎన్నికల్లో తన అజెండాపై ఈ మహానాడు వేదికపైనుండి ప్రజలకు స్పష్టత ఇచ్చారు విజయ్. తన మేనియా ఏంటో మరోసారి తన అపొనెంట్స్‌కు సినిమా వేసి మరీ చూపించారు. పెరియార్, అన్నాదురై, అంబేద్కర్.. ఆశయ సాధనే లక్ష్యమన్నాడు విజయ్. కాకపోతే పెరియార్ సిద్ధాంతాల్లో ఒక్కదానిని మాత్రం విజయ్ వ్యతిరేకించాడు. దేవుడు లేడన్న ఆయన మాటలతో విజయ్ ఏకీభవించలేదు.
రాజకీయాలు పాములాంటివని.. కాటేస్తుందని తెలిసినా.. వెనక్కు తగ్గేది లేదన్నాడు. తాను ఎవరికీ Aటీమ్, B టీమ్ కాదనన్నాడు. రంగులు వేసుకునే వాళ్లకు రాజకీయాలు ఎందుకు అన్నవారికి సమాధానం చెప్పి తీరుతానన్నాడు విజయ్. ద్రవిడ మాడల్ అంటూ రాష్ట్ర ప్రజలను ఇక్కడి పార్టీలు మోసం చేస్తున్నాయని, అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు విజయ్. డీఎంకే తన రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేసిన విజయ్.. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఏ పార్టీకి తాము ఏ టీం లేదా బీ టీం కాదని స్పష్టం చేస్తూ.. ఇది వరకు ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము రావడం లేదని, రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టిస్తామని వివరించారు.
తమిళనాడు పాలిటిక్స్ లో ఫ్రీ స్కీముల విషయంలో విజయ్ పార్టీ టీవీకే స్టాండేంటి? ఎందుకంటే.. ఫ్రీ స్కీమ్స్ కు తమిళనాడులో భారీగా రెస్పాన్స్ ఉంటుంది. డీఎంకే, అన్నాడీఎంకే వీటి విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తుందా లేదా అన్న సంగతి కన్నా.. ఓట్ల వేటే ముఖ్యం అన్నట్టుగా ఇలాంటి పథకాలు చాలా చోట్ల అమలవుతున్నాయి. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్.. వీటి విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ముఖ్యమని అందరి బాటలోనూ నడుస్తారో.. లేదా వాటికి కోత విధిస్తారో.. పూర్తిగా చెక్ పెడతారో త్వరలో తేలుతుంది తమిళనాట ఉన్న రాజకీయ లాభాన్ని పొందడానికి విజయ్ చాలా జాగ్రత్తగా, తెలివిగా పావులు కదుపుతున్నాడు. సినిమాల్లో హిట్ కొట్టినంత ఈజీ కాదు.. పార్టీని గెలిపించడం. విజయ్ కూ ఈ విషయం తెలుసు. ప్రత్యర్థులతో పాటు.. సొంత పార్టీలోనూ కొన్ని సందర్భాల్లో సెగలు తప్పవు. రాజకీయంగా వాటన్నింటినీ ఫేస్ చేసి.. పాస్ అయితేనే.. రాటుదేలుతారు.
ఇప్పుడు అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలంతా ఇలా వచ్చినవారే. సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ కు మాస్ ఫాలోయింగ్ ఉండడం కలిసొచ్చే అంశం. కానీ అదొక్కటే ఆయనను అందలం ఎక్కిస్తుందని చెప్పలేం. కాకపోతే ఎంజీఆర్, ఎన్టీఆర్ ల ప్రస్తావన తీసుకువచ్చారు కాబట్టి.. రాజకీయాలను ఔపోసన పట్టారని భావించవచ్చు. వచ్చే రెండేళ్లలో ఆయన పార్టీ ఏమేరకు ప్రజలకు చేరువవుతుంది.. వారి విశ్వాసాన్ని ఏమేరకు చూరగొంటుంది అన్నదానిపైనే.. విజయ్ ఆశలు నెరవేరే అవకాశం ఉంది. మరోవైపు.. అప్పుడే విజయ్ పార్టీ భావజాలంపై ద్రవిడ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.ఒక వైపు ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని ఆహ్వానిస్తూనే ఆయన చెప్పిన పార్టీ భావజాలంపై విమర్శలు చేశాయి. విజయ్ చెప్పిన విధానాలు అన్నీ తమవేనని, ఆయన చెప్పిన విధానాలు, భావజాలాన్ని తాము ఆచరిస్తున్నామని, అమలు చేస్తున్నామనీ డీఎంకే నేతలు తెలిపారు.
స్టాలిన్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నదని విజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. డీఎంకే ఎంతోమంది ప్రత్యర్థులను చూసిందని, సుదీర్ఘంగా విజయవంతంగా రాజకీయాల్లో ఉన్నదని వివరించారు. విజయ్‌కిది తొలి సభ మాత్రమేనని, ఇప్పుడే విమర్శలు చేయాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్ విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఆయన పార్టీ భావజాలాన్ని ఎత్తిచూపారు. అన్ని పార్టీల భావజాలల సమ్మేళనాన్ని తన పార్టీ భావజాలంగా విజయ్ చెప్పారని ఆరోపించారు. టీవీకే పార్టీ భావజాలం, విజయ్ రాజకీయ ప్రవేశం.. కొత్త సీసాలో పాత సారాలాగే ఉన్నదని పేర్కొన్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీల భావజాలాల నుంచే టీవీకే పార్టీ భావజలాన్ని రూపొందించారని ఆరోపించారు.