CM Yogi Adityanath: త్రివేణీ సంగమంలో నీరు తాగొచ్చు కూడా.. బ్యాక్టీరియా వార్తలపై సీఎం యోగి సీరియస్

మహాకుంభ మేళా సందర్భంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద నెల రోజుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇక్కడి గంగా నది నీటిలో బ్యాక్టీరియా (faecal bacteria) చాలా అధికంగా ఉందని, స్నానం చేయడానికి ఈ నీరు సరైంది కాదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక భక్తులతోపాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తీవ్రంగా స్పందించారు. నది నీళ్లు తాగడానికి కూడా బాగానే ఉన్నాయని, ఈ విషయంలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఖండించారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ‘మృత్యు కుంభ్’ విమర్శలపై కూడా సీఎం యోగి మండిపడ్డారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదికను చూపించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా.. మహాకుంభ్‌లో వివిధ ప్రాంతాల్లోని నీటిలో అధిక స్థాయుల్లో బ్యాక్టీరియా ఉందని చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో బ్యాక్టీరియా ఇలా పెరిగిందని పేర్కొంది. దీనిపై స్పందించిన యోగి (CM Yogi Adityanath).. ‘‘త్రివేణీ సంగమం వద్ద నీరు తాగేందుకు కూడా అనుకూలంగానే ఉంది. సనాతన ధర్మం, గంగామాత, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే.. 56 కోట్ల మంది నమ్మకంతో ఆటలాడినట్లే’’ అని మండిపడ్డారు. కాగా, యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 56.25 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు.