Narendra Modi: క్షమించండి… అందుకే లేటుగా వచ్చా : మోదీ

భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లోనూ చూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఆర్థికరంగంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు (World Bank) చెప్పిందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (Global Investor Summit) లో మాట్లాడిన ప్రధాని సదస్సులో పాల్గొన్న వారికి క్షమాపణలు తెలియజేశారు. తాను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని చెప్పారు. 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ప్రారంభమయ్యే సమయం, నేను రాజ్‌భవన్(Raj Bhavan) నుంచి బయల్దేరే సమయం ఒకటే. అప్పుడు నేను వస్తే భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కావొచ్చు. దాంతో విద్యార్థులు(Students) ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే వారంతా పరీక్షా కేంద్రాలకు వెళ్లిన తర్వాత రాజ్‌భవన్ నుంచి బయల్దేరాలనుకున్నాను. దాంతో 15`20 నిమిషాలు ఆలస్యమైంది. ఇక్కడ మీరు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నాను అని మోదీ మాట్లాడారు.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని అన్నారు. రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు సంభవించాయి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టిసారించింది. 20 సంవత్సరాలకు ముందు ఇక్కడి రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందువరుసలో ఉంది. సౌరశక్తిలో భారత్ సూపర్‌గా మారిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ విభాగం కీర్తించింది. ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే భారత్ చెప్పింది చేసే చూపించిందని ఆ సంస్థే పేర్కొంది. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి అని పేర్కొన్నారు.