ఉద్యోగులకు విప్రో మరో షాక్
వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించిన ఉద్యోగులకు షాక్ ఇచ్చిన దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో తన ఉద్యోగులకు తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సంస్థలోని టాప్ పెర్ఫార్మర్స్కు జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఏటా డిసెంబర్లో విప్రోలో వేతన సవరణ జరుగుతుంది. ఈ ఏడాది కూడా కొందరికీ జీతాలు పెరగనున్నాయి. అయితే టాప్ పెర్ఫార్మర్స్ అందరికీ ఈసారి జీతం పెరగడం అనుమానమే. అధిక వేతనం తీసుకుంటున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని అంతర్గత ఈమెయిల్స్ ద్వారా సదరు ఉద్యోగులకు విప్రో సమాచారం అందించినట్లు తెలిసింది. విప్రో యాజమాన్యం తక్కువ జీతం పొందే కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తక్కువ జీతాలు పొందుతున్న వాళ్లకు యథావిధిగా డిసెంబర్ ఒకటో తారీఖున జీతాలు పెరగనున్నాయని తెలిపింది.






