ఉద్యోగులకు విప్రో షాక్…. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా
దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వర్క ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడిరచింది. ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ పద్ధతిని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు విప్రో కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు నవంబర్ 6వ తేదీన ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఈ ఆదేశాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.






