Rahul Gandhi: అర్ధరాత్రి తొందరపాటు నిర్ణయాలెందుకు?.. సీఈసీ నియామకంపై రాహుల్ గాంధీ సీరియస్

భారత ఎన్నికల సంఘం కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను, ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా వివేక్ జోషిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టులో సీఈసీ ఎంపికపై విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇలా అర్ధరాత్రి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని రాహుల్ అన్నారు.
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టులో రాహుల్ గాంధీ (Rahul Gandhi).. “ఎన్నికల కమిషనర్ ఎంపికకు కమిటీ సమావేశంలో మోదీ, అమిత్ షాలకు అభ్యంతరాలను తెలియజేశాం. ఎన్నికల సంఘం స్వతంత్రత చాలా ముఖ్యమైన అంశం. దీంట్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం ఉండకూడదు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, అర్ధరాత్రి సమయంలో కొత్త సీఈసీని ఎంపిక చేసిన విధానం మన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఇప్పటికే ఉన్న ఆందోళనలను మరింత పెంచుతుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టులో 48 గంటల్లో విచారణ జరగనుండగా, ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు,” అని పేర్కొన్నారు. ఈ నియామకాలను మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆమోదించింది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సభ్యులుగా ఉన్నారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన వ్యక్తుల పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా.. ఆమె ఈ పేర్లను ఆమోదించారు.